Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు

పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు

  • మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయంతో రూ.1.18 కోట్ల కుచ్చుటోపీ

  • బాధితురాలు నిలదీస్తే.. పరువు తీస్తానని బ్లాక్‌మెయిల్‌

  • గతంలో అతడిపై హత్య, గంజాయి కేసులు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమోనీ సైట్‌ ద్వారా ఒంటరి మహిళతో పరిచయం పెంచుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతోపాటు శారీరక సంబంధం ఏర్పరుచుకుని విడతల వారీగా రూ.1.18 కోట్లు స్వాహా చేసిన ఘరానా మోసగాడిని మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి, ఆదివారం రిమాండ్‌పై తరలించారు. మేడిపల్లి - పీర్జాదిగూడ ప్రాంత మహిళ (41)తో కమ్మ మ్యాట్రిమోనీ సైట్‌లో 2024లో పరిచయం పెంచుకున్న కోనేటి ప్రదీప్‌ (41).. తనకు తల్లిదండ్రుల్లేరని, అనివార్య కారణాలతో తనకు విడాకులయ్యాయని నమ్మించి.. క్రమంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

తన పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో బాధితురాలు అతడు అడిగినప్పుడల్లా డబ్బులిస్తూ వచ్చింది. అలా గత రెండున్నరేళ్లలో రూ.1.18 కోట్లు తీసుకున్న సదరు వ్యక్తి.. ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా దాటవేశాడు. కొద్ది రోజుల క్రితం ప్రదీప్‌ను నిలదీసిన బాధితురాలు.. తన డబ్బు తనకివ్వాలని ఒత్తిడి చేయడంతో తనతో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు చూపాడు.

తనకు మరో రూ.4 లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేసి పరువు తీస్తానని ప్రదీప్‌ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మేడిపల్లి పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌పై తరలించాడు. ఈ కేసు దర్యాప్తు క్రమంలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఒక హత్య, గోల్కొండ, తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గంజాయి (ఎన్‌డీపీఎ్‌స) కేసులున్నాయని పోలీసులు గుర్తించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy