నిజామాబాద్ : కరోనా రాకుండా మందులు ఇస్తానని ఆశచూపి ఓ ప్రబుద్ధురాలు మత్తు మందు ఇచ్చి వృద్ధురాలి నగలతో ఉడాయించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరు.. ఈ నెల 8వ తేదీన నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు కామారెడ్డి జిల్లా భిక్కనూరులో బంధువులు చనిపోవడంతో వెళ్లేందుకు కామారెడ్డి బస్సు ఎక్కింది. ప్రయాణంలో లక్ష్మికి ఓ గుర్తుతెలియని మహిళతో పరిచయం ఏర్పడింది. కామారెడ్డికి చేరుకున్న ఇద్దరు టిఫిన్ చేసి భిక్కనూరు బస్సు ఎక్కి వెళ్లారు.
సాయంత్రం నిజామాబాద్‌కు ఇద్దరం కలిసి వెళ్దామని గుర్తుతెలియని మహిళ లక్ష్మికి చెప్పింది. సాయంత్రం 5 గంటలకు ఇద్దరు కలిసి ఆటోలో కామారెడ్డికి బయలుదేరారు.
ఆటోలో వెళ్తున్న సమయంలో నా దగ్గర కరోనా రాకుండా ఉండేందుకు మందులు ఉన్నాయని మాయమాటలు చెప్పి లక్ష్మికి వేయించింది. మందులు వేసుకున్న లక్ష్మి స్పృహ కోల్పోయింది. దీంతో ఆమె దగ్గర ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. స్పృహలోకి వచ్చిన లక్ష్మి ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో మూడో టౌన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..

