
రాయలసీమ రాళ్లల్లో దాగిన చెమట చుక్కల్ని, కన్నీటి జీవితాలను మాత్రమే కాదు; అక్కడి తరతరాల సంస్క ృతినీ, సమాజాన్నీ బలంగా అక్షర చిత్రాల్లో అందించే రచయిత బండి నారాయణ స్వామి. ఆయన రచనల్లో శిఖరాయమానమైది 'శప్తభూమి' నవల. తాజాగా ఈ నవలకు భారత ప్రభుత్వం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. తరతరాల రాయలసీమ చరిత్రను కళ్లముందుంచేలా శప్తభూమిని పాఠకలోకం ముందుంచారు స్వామి. ఇకపై ఇది అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం కానుంది. ఈ సందర్భంగా రచయిత బండి నారాయణస్వామి 'జీవన' విశేషాలు ఈరోజు ప్రత్యేకం ...
రాయలసీమ ఎన్నో సాహిత్య ప్రక్రియలకు పుట్టినిల్లు.
తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న జనం ఆవేదననీ, అక్రందనల్నీ కథ, కవిత్వం, నవల, వ్యాసం, నాటకం, పాట... ఇలా చాలా రూపాల్లో సీమ రచయితలు వ్యక్తీకరిస్తూనే ఉన్నారు. అందుకే సీమ సాహిత్యం ఎల్లప్పుడూ నవజీవన చైతన్యంతో తొణికిసలాడుతుంటోంది. అలాంటి సాహితీవేత్తల్లో పేరెన్నికగన్న కథకుడు బండి నారాయణస్వామి.
ఇదీ నేపథ్యం ...
బండి నారాయణస్వామి అరవై ఐదేళ్ల కిందట అనంతపురంలోని పాతూరులో 1952 జూన్ 3న పుట్టారు. తల్లిదండ్రులు హొన్నూరప్ప, పోలేరమ్మ దంపతులు. శ్రమ చేస్తేగానీ జీవితాలు ముందకు సాగని ఆ కుటుంబంలో మొత్తం నలుగురు సంతానంలో నారాయణస్వామి మొదటివారు. పాతూరులోని వైఎస్ గిరి ఎలిమెంటరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి ఆరో తరగతి నుంచి పీయూసీ వరకూ ఎస్‌ఎస్‌బీఎన్ హైస్కూల్‌లో చదివారు. తర్వాత ఆర్ట్స్ కళాశాలలో బీఏ(టీహెచ్‌పీ), ఎస్వీయూ పీజీ సెంటర్‌లో ఎంఏ (తెలుగు), నెల్లూరులో బీఈడి పూర్తి చేశారు.
ఉద్యోగ జీవితం
నారాయణస్వామి ఉద్యోగ జీవితం ఉపాధ్యాయునిగా మొదలైంది. 1982 జూన్‌లో బ్రహ్మసముద్రం మండలం గుడిపల్లిలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. అదే ఏడాది పరంజ్యోతిని వివాహం చేసుకున్నారు. 1987లో గుడిపల్లి పాఠశాల నుంచి కళ్యాణదుర్గం మండలం పులికల్లు పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడే 1994 వరకు విధులు నిర్వర్తించారు. 1995లో జిల్లాకేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అక్షరాస్యత ఉద్యమంలో డెప్యుటేషన్‌పై జిల్లా రీసోర్స్ పర్సన్‌గా చేరి, 1999 వరకూ పనిచేశారు. 2000లో పదోన్నతి పొంది, 2001 వరకు సలకంచెరువు హైస్కూల్‌లో పనిచేశారు. 2001 నుంచి 2008 వరకు తగరకుంట హైస్కూల్, 2009-10లో కందుకూరు హైస్కూల్‌లో విధులు నిర్వర్తించి, అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. నారాయణస్వామికి ఇద్దరు పిల్లలు.. కుమారుడు విహారి ఢిల్లీలో ఓ ఛానల్‌లో విలేకరిగా విధులు నిర్వర్తిస్తుండగా, కుమార్తె అరుణాచలం సౌరిస్ గృహిణి.
సాహిత్యంలోకి ...
పుట్టింది శ్రామిక కుటుంబం, కష్టాలు.. కన్నీళ్లూ సహజమైన వాతావరణంలో జీవిత పాఠాలు స్కూలు పాఠాలకన్నా ముందే బాగా అర్థమయ్యాయి. అందుకే చిన్నవయసులోనే స్వామికి పాఠ్యాంశాలతోపాటు సాహిత్య పాఠాలంటే కూడా మక్కువ ఏర్పడింది. ఆరో తరగతి నుంచి ఎస్‌ఎస్‌బీఎన్ పాఠశాలలో ఉపాధ్యాయులు కవిత్వాలు, పద్యాలు, రచనలు, కథలను బోధించేవారు. పలుమార్లు నాటకాలూ ఆడించేవారు. దీంతో నారాయణస్వామికి ఎస్‌ఎస్‌బీఎన్ స్కూల్ గొప్ప సాహితీ సాంస్క ృతిక వేదికగా మారింది. దీనికితోడు తన సహ విద్యార్థి అరుణాచలం దక్షిణామూర్తి కుటుంబంతో బాగా పరిచయమేర్పడింది. వీరి ఇంటికి వెళ్లినపుడల్లా కథలు, నవలలు చదివేవారు. ఆ ప్రభావంతో తొలిసారి 'పరివర్తన' అనే కథను రాశారు. అప్పట్లో ఇది ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల మ్యాగజైన్‌లో ప్రచురితమైంది. ఈ ప్రోత్సాహంతోనే తర్వాత రోజుల్లో నవలలు, కథలు రాయసాగారు.
ముద్రణ దశలోనే శప్తభూమికి అవార్డు
తన రచనలకు అవార్డులు పొందడం నారాయణస్వామికి కొత్తేమీకాదు. శప్తభూమి నవలకు అది ముద్రణ దశలో ఉన్నప్పుడే 2017లో తానా అవార్డును పొందింది. ఇదే నవలకు ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. పాఠశాల స్థాయి నుంచే స్వామి కథలు, నవలలు రాస్తూ అధ్యాపకుల ప్రశంసలందుకునేవారు. ఉపాధ్యాయుడిగా తనకున్న స్థానిక అవగాహనతో అనేక కథలు రాశారు. ఆ కృషి అప్పాజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్, కథాకోకిల పురస్కారాలను అందించాయి. తర్వాతిదశలో కొలకలూరి ఇనాక్ చేతుల మీదుగా కథలు, నవలలు రెండు విభాగాల్లోనూ రెండుసార్లు పురస్కారాలందుకున్నారు. ఎన్టీఆర్ పురస్కారాన్ని డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి నుంచి అందుకున్నారు. పలు పత్రికా సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లోనూ ఎన్నోసార్లు వివిధ స్థాయిల్లో బహుమతుల్ని అందుకున్నారు.
'రాయలసీమ మట్టిలో పుట్టి, ఈ గడ్డ నీళ్లు తాగి, ఈ ప్రాంతపు భాష, యాస, సంస్కృతి... వీటిని చిన్నప్పటి నుంచి జీవితంలో పెనవేసుకుపోయి పెరిగినవాడిని. అందుకే రాయలసీమ బిడ్డగా, రచయితగా ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని ఓ కోరిక నాలో ఎప్పటి నుంచో ఉండేది. అది ఈ నవల ద్వారా కొంతవరకూ సాధ్యమైందనే భావిస్తాను!' అంటున్న నారాయణస్వామి నుంచి మరిన్ని మంచి రచనలు రావాలని కోరుకుందాం.
18వ శతాబ్దపు ఇతివృత్తం ఇది
రాయలసీమ అస్తిత్వానికి అక్షరరూపాన్ని ఇవ్వడమే లక్ష్యంగా 'శప్తభూమి' రాశాను. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు 1951లో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగింది. కట్టుబట్టలతో రాయలసీమ కష్టాల్లోనే మిగిలిపోయింది. ఈ నవలలోని కథాకాలం 18వ శతాబ్దం. అది ఇక్కడ అంధయుగం. ఊరికో రాజు, వీథికో పాలెగాడు రాజ్యమేలుతున్న అరాచకకాలాన్ని ఈ నవల ద్వారా తెలుగు సమాజం కళ్లముందుంచే ప్రయత్నాన్ని చేశాను.
- బండి నారాయణస్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
శ్రీశ్రీ చేతుల మీదుగా ...
ఒక సాహితీ సంస్థ నిర్వహించిన కవితల పోటీకి 1975లో బండి నారాయణస్వామి తన కవితను పంపారు. అప్పట్లో ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది మహాకవి శ్రీశ్రీ. బహుమతి ప్రదానం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. శ్రీశ్రీ నుంచి తన కవితకు ద్వితీయ బహుమతిని అందుకోవడం స్వామికి మంచి ఉత్సాహం కలిగింది. సాహిత్యాభిలాష రెట్టింపయ్యింది. ప్రముఖ సాహితీవేత్తలు కొలకలూరి ఇనాక్, సింగమనేని నారాయణ, చిలుకూరి దేవపుత్రలను తన సాహిత్య గురువులుగా ఎంచుకుని, వారి సూచనలతో తనలోని సాహితీ ప్రతిభకు పదును పెట్టారు. ఈ క్రమంలోనే రాజకీయం, మానవత్వం, ప్రేమ, రైతాంగ జీవితాలు ఇలా రకరకాల సామాజికాంశాలపై 45కు పైగా కథలు, వీరగల్లు, చెమ్కీదండ కథాసంపుటాలు రాశారు. 1991లో గద్దలాడతాండాయి, 2005లో మీరాజ్యం మీరేలండి, 2010లో రెండు కలల దేశమ్, 2017లో శప్తభూమి నవలు రాశారు. సీనియర్ సాహితీవేత్తలు రావిశాస్త్రి, చలం, కొడవటిగంటి కుటుంబరావు, ఆర్‌ఎస్ సుదర్శనం, బాలగంగాధర్ తిలక్, కాళీపట్నం రామారావు వంటివారు తన సాహితీ ప్రయాణానికి మార్గదర్శకులను నారాయణస్వామి చెబుతున్నారు.
శప్తభూమి వెనుక కథ
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన రాయలసీమలో ఉజ్వలమైన చరిత్ర ఉంది. సజీవ సంస్కృతి ఉంది. దానిని నేటి తరానికి అందించాలన్న తపనతోనే ఈ శప్తభూమి రాశానని నారాయణస్వామి చెప్పారు. ఆయన తగరకుంటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో పాఠశాలకు వెళ్లే మార్గంలో చారిత్రక ఘట్టాలు కనిపించేవి. ప్రతిఏటా జరిగే గులిగానప్ప పరస, ఆ పరస వెనుక గల శతాబ్దాల చరిత్ర, దాదాపు 200 సంవత్సరాల కిందటి గాలిదేవర సమాధి, కదిరప్ప సరస వంటివి ఈ నవలకు ప్రేరణగా తీసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఉద్యమం కూడా రాయలసీమ ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. అందుకే ఆ ఉద్యమానికీ ఈ నవలలో ప్రాధాన్యత ఉంది. శప్తభూమి సాంస్కృతికపరమైన నవల. చారిత్రక నవల రాయడం అధ్యయనంతో కూడుకున్న పని. నారాయణస్వామి 2007 నుంచి అధ్యయనం చేశారు. ఒక ఏడాది పాగు రచన చేశారు. దాదాపు దశాబ్దకాలం పట్టిది ఈ నవల పుస్తకరూపం దాల్చడానికి. అవార్డుల పట్ల నారాయణస్వామికి పెద్ద ఆసక్తిలేదు. కానీ 2017లో ఈ శప్తభూమి నవల విడుదలయ్యాక ఎందరో పాఠకులు దీనికి అవార్డు రావాలని కోరుకున్నారు. అంతవరకూ తనకు వాటి గురించి ఆలోచనే లేదని స్వామి చెప్పారు.
- బెందాళం క్రిష్ణారావు