ఆంధ్రజ్యోతి

2.7M Followers

మన కౌబాయ్‌కు 50 ఏళ్లు!

26 Aug 2021.01:08 AM

కౌబాయ్‌ అంటే ఎవరూ అని తెలుగు సినిమా ప్రేక్షకుడిని అడగండి.. సూపర్‌ స్టార్‌ కృష్ణ అని టక్కున సమాధానం వస్తుంది. దీనికి కారణమైన సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'.

ఇక మన నేటివిటీకి ఆమడ దూరంలో ఉండే కౌ బాయ్‌ని తెలుగు తెరపైకి తెచ్చి, ఇతను మనవాడే అనే అనుభూతి కలిగించారు హీరో కృష్ణ. కౌబాయ్‌ కథాంశం తో తెలుగులో ఒక సినిమా తీయడం, అది ఘన విజయం సాధించడం సాధారణమైన విషయం కాదు. ఆ తర్వాత కృష్ణ అనేక పాత్రల్లో నటించినా- ఈ చిత్రం మాత్రం ఆయన నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచి పోయింది. ఈ సినిమా విడుదలై రేపటికి (శుక్రవారం) 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా హీరో కృష్ణను, ప్రధాన విలన్‌గా నటించిన కైకాల సత్యనారాయణను 'చిత్రజ్యోతి' పలకరించింది. వారు చెప్పిన విశేషాలివి..

'మా పద్మాలయా సంస్థ నిర్మించిన తొలి చిత్రం 'అగ్నిపరీక్ష' కు లాభాలు రాలేదు. పెట్టిన డబ్బు కూడా కొంత పోయింది. అందుకే రెండో సినిమా తీయడానికి కొంత గ్యాప్‌ తీసుకున్నాం. ఆ సమయంలోనే కౌబాయ్‌ చిత్రం 'గుడ్‌ బాడ్‌ అగ్లీ' చెన్నైలో విడుదల అయింది. హాలీవుడ్‌లో తయారైన తొలి కౌబాయ్‌ చిత్రం అది. అందరూ బాగుందని చెప్పడంతో నేను కూడా వెళ్లాను. ఆ సినిమా చూసి థ్రిల్‌ ఫీలయ్యా. తెలుగులో తీస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చి, ఆ సినిమా చూడమని ఆరుద్రగారికి చెప్పా. ఆయన చూసి మళ్లీ నా దగ్గరకు వచ్చారు. 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' చిత్రానికి 'మెకన్నాస్‌ గోల్డ్‌' సినిమాలోని కొన్ని పాయింట్లు జోడించి కథ తయారు చేస్తాను. అది మీరు విన్న తర్వాత డిసైడ్‌ చేద్దాం' అన్నారాయన. 'డాకోస్‌ రెవెంజ్‌' అనే సినిమాలో కొన్ని అంశాలు తీసుకుని చిత్రకథ తయారు చేశారు. హాలీవుడ్‌ కథకు తెలుగుతనాన్ని జోడించారు. నాకు బాగా నచ్చింది. వెంటనే సినిమా తీద్దామని నిర్ణయం తీసుకున్నా. దర్శకుడిగా ఎవరిని తీసుకుందామా అని ఆలోచనలో పడ్డాం. ఆ సమయంలోనే విజయలలిత నటించిన 'రౌడీ రాణి' చిత్రం విడుదలైంది. దానికి దాస్‌ దర్శకుడు. ఆ సినిమాను ఆయన చాలా బాగా తీశారు. అందుకే ఆయన్ని ఎంపిక చేశాం.

విమానంలో నలుగురే..

విభిన్న కథాంశంతో తీసే చిత్రం కావడంతో దీనిని కలర్‌లో తీద్దామని నిర్ణయించుకొన్నాను. కానీ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీస్తేనే పెట్టుబడి పెడతామని డిస్ర్ట్రిబ్యూటర్లు చెప్పారు. నేను వినిపించుకోకుండా కలర్‌లో తీయడానికి ఫిక్స్‌ అయ్యాను. నిర్మాణపరంగా రాజీ పడలేదు కానీ అనవసర ఖర్చులు తగ్గించాం. చెన్నై నుంచి రాజస్థాన్‌ వెళ్లడానికి నాలుగంటే నాలుగు ఫ్లైయిట్‌ టిక్కెట్లు తీసుకున్నాం. నేను, నిర్మల (విజయనిర్మల), జ్యోతిలక్ష్మి, నాగభూషణం మాత్రమే ఫ్లైయిట్‌లో వెళ్లాం. దర్శకుడు దాస్‌, ఛాయాగ్రాహకుడు స్వామి, డాన్స్‌ మాస్టర్‌ హీరాలాల్‌ సహా మిగిలిన వాళ్లంతా ట్రైన్‌లోనే రాజస్థాన్‌ వచ్చారు. బికనీర్‌ నుంచి జైసాల్మీర్‌ వరకూ వంద కిలోమీటర్లు అంతా ఎడారే. అక్కడ షూటింగ్‌ చేశాం. బికనీరు నుంచి సిమ్లాకు కారులో వెళ్లాం. ఆ రోజుల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సినిమా తియ్యాలంటే సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ మేం ఏడు లక్షల రూపాయలతోనే కలర్‌లో 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం తీయగలిగాం.

చక్రపాణిగారికి నచ్చలేదు

విజయా సంస్థ అధినేతల్లో ఒకరైన చక్రపాణి గారికి 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం నచ్చలేదు. 'ఏమిటీ అవతారాలు? మన నేటివిటికి తగిన సినిమా కాదు.. ఆడదు' అంటుండేవారు. ఆయన జడ్జిమెంట్‌ చాలా కరెక్ట్‌గా ఉండేది. సినిమా ఆడదు అంటే ఆడేది కాదు. కానీ 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం విషయంలోనే ఆయన అంచనాలు తప్పాయి. ఇక సినిమా విశేషాలకు వస్తే- షూటింగ్‌లో రాజస్థాన్‌ పోలీస్‌ ఫోర్స్‌కు సంబంధించిన గుర్రాలను ఉపయోగించాం. నేను స్వారీ చేసిన గుర్రం నన్ను రెండు సార్లు పడేసింది. ఆ తర్వాత దానిని మచ్చిక చేసుకుని మిగిలిన సన్నివేశాల్లో నటించాను. సినిమా రెడీ అయిన తర్వాత చెన్నైలో ప్రీవ్యూ వేశాను. అందరూ చూసి 'ఇదేం సినిమా.. ఆడడం కష్టం' అన్నారు. రామారావుగారు చూశారు. 'మంచి మాస్‌ చిత్రం తీశారు బ్రదర్‌.. హిట్‌ అవుతుంది. బట్‌ లేడీస్‌ని మిస్‌ అవుతారు' అన్నారు. ఆయన అన్నట్లే జరిగింది. ఎక్కువ రోజులు ఆడలేదు కానీ రెవెన్యూ బాగా వచ్చింది. తర్వాత విడుదలైన ప్రతిసారీ మంచి కలెక్షన్లతో ఆడింది.

మేకప్‌ మాయాజాలం

ఇందులో కృష్ణను నాగభూషణం ఎడారిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. ఆ ఎండ వేడికి ఆయన ముఖమంతా కమిలిపోయి, పొక్కులు కూడా వస్తాయి. ఈ సీన్‌ తీసేముందు ఛాయాగ్రాహకుడు వి.ఎస్‌.ఆర్‌.స్వామి మేకప్‌ మాధవరావును పిలిచి కృష్ణ ఫేస్‌లో చీము పొక్కుల ఎఫెక్ట్‌ కావాలని చెప్పారు. ఎడారిలో షూటింగ్‌ జరుగుతోంది. అప్పటికప్పుడు అలాంటి ఎఫెక్ట్‌ ఇవ్వాలంటే మెటీరియల్‌ ఎక్కడ దొరుకుతుంది? అందుకే మాధవరావు ఆలోచించి సింపుల్‌ పద్ధతి ఫాలో అయ్యారు. బఠానీ గింజలు తెప్పించి, పై పొర తీసి రెండు ముక్కలుగా కట్‌ చేశారు. ఆ తర్వాత ఒక్కో పొరకు గమ్‌ అంటించి, మేకప్‌ పూర్తయిన తర్వాత హీరో కృష్ణ ముఖం మీద అక్కడక్కడ ఉంచారు. స్ర్కీన్‌ మీద అవి చీము పొక్కుల్లానే కనిపించాయి.

నా రెండో రంగుల చిత్రం

నేను నటించిన తొలి రంగుల చిత్రం 'లవకుశ'. రెండో రంగుల సినిమా 'మోసగాళ్లకు మోసగాడు'. ఈ చిత్ర నిర్మాణ సమయంలో పరిశ్రమ నుంచి రకరకాల కామెంట్స్‌ వినిపించాయి. 'కౌబాయ్‌ సినిమా అట. రాజస్థాన్‌లో షూటింగ్‌ అట. కలర్‌లో తీస్తాడట. అంత సత్తా కృష్ణకు ఉందా?' అని. కానీ అవేమీ కృష్ణ, అతని సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు పట్టించుకోలేదు. 'సాహసమే నా ఊపిరి' అనే మనస్తత్వం కృష్ణది. అందుకే సాహసం చేసి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం నిర్మించారు. ఆ సమయంలో నేను విలన్‌ పాత్రలతో చాలా బిజీగా ఉన్నాను. అయినా కృష్ణ అడగగానే డేట్స్‌ అడ్జెస్ట్‌ చేసి ఇందులో నటించాను. మెయిన్‌ విలన్‌ రోల్‌ నాకే ఇచ్చారు. ఈ సినిమా అనే కాదు పద్మాలయా సంస్థ నిర్మించిన ఏ చిత్రానికైనా మొదటి పిలుపు నాకే వచ్చేది. తెలుగులో రూపు దిద్దుకొంటున్న తొలి కౌబాయ్‌ చిత్రం కనుక 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రనిర్మాణం నాకూ ఆసక్తి కలిగించింది. 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రం షూటింగ్‌ సమయంలో ఒకసారి ప్రమాదవశాత్తు గుర్రం మీద స్వారీ చేస్తున్న నేను 30 అడుగుల గోతిలో పడిపోయాను. నా మీద గుర్రం పడి ఉంటే ఇక అంతే సంగతులు. నేను ఒక పక్క, గుర్రం మరో పక్క పడిపోయాం. ఇక అప్పటినుంచి గుర్రపు స్వారీ సన్నివేశాల్లో పాల్గొనడం అంటే నాకు భయం. దీనివల్ల ఒకటిరెండు సినిమాలు వదులుకొన్నాను కూడా. అయితే 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని గుర్రపు స్వారీ సన్నివేశాల్లో పాల్గొన్నా. ఈ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు రావడమే కాకుండా ఆ ఏడాదిలో వివిధ సంస్థలు ప్రకటించిన అవార్డుల్లో 'ఉత్తమ విలన్‌' గా నేను ఎంపిక అయ్యాను.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Andhrajyothy

#Hashtags