365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 4,2026 : ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గుచూపుతున్నారు. పర్యావరణహితంతో పాటు రోజువారీ ప్రయాణాల్లో ఈవీలు ఇచ్చే మైలేజ్ ఆదా వినియోగదారులను ఆకర్షిస్తోంది. అయితే, కొత్తగా ఈవీ కొనుగోలు చేసే సమయంలో కేవలం బ్యాటరీ రేంజ్, చార్జింగ్ సమయం మాత్రమే కాకుండా.. వాహన బీమా (Insurance) విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్ల బీమా నిబంధనలతో పోలిస్తే ఈవీ బీమా పాలసీలలో కొన్ని కీలక మార్పులుంటాయి. అవేంటో తెలుసుకుందాం..
బ్యాటరీ రక్షణే కీలకం..
సాధారణ ఇంధన కార్లలో ఇంజిన్ ప్రధానమైతే, ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ప్యాక్ అత్యంత ఖరీదైన భాగం.
చార్జర్, కేబుల్స్ కవరేజీ ఉందా..?
ఎలక్ట్రిక్ కార్లతో పాటు వచ్చే పోర్టబుల్ చార్జర్లు, కేబుల్స్ కూడా ఎంతో విలువైనవి. ప్రమాదవశాత్తు అవి డ్యామేజ్ అయినా లేదా దొంగతనానికి గురైనా సాధారణ బీమా పాలసీలు వాటిని కవర్ చేయకపోవచ్చు. అందుకే పాలసీ తీసుకునే సమయంలో చార్జింగ్ పరికరాలు, కేబుల్స్‌కు తగిన కవరేజీ అందించే యాడ్-ఆన్స్ ఉన్నాయో లేదో ముందే పరిశీలించాలి.
అధీకృత ఈవీ గ్యారేజీల నెట్‌వర్క్..
ఈవీలలో హై-వోల్టేజ్ బ్యాటరీ వ్యవస్థలు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. వీటి మరమ్మతులకు సాధారణ మెకానిక్‌లు సరిపోరు; ప్రత్యేక శిక్షణ పొందిన టెక్నీషియన్లతో కూడిన వర్క్‌షాప్‌లు అవసరం. కాబట్టి మీ బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో మీరుండే నగరంలో ఈవీలను రిపేర్ చేయగల అధీకృత క్యాష్‌లెస్ గ్యారేజీలు ఉన్నాయా లేదా అనేది ముందే ధ్రువీకరించుకోవాలి.
ప్రీమియం తక్కువని చూడొద్దు..!
పాలసీ ప్రీమియం తక్కువగా ఉందని తొందరపడి ఏదో ఒక బీమా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. కారు ప్రకటిత విలువ (IDV - Insured Declared Value), జీరో డిప్రిసియేషన్ (Zero Depreciation) సదుపాయం, బ్యాటరీ, ఎలక్ట్రానిక్ విడిభాగాలకు లభించే క్లెయిమ్ పరిమితులను బేరీజు వేసుకోవాలి. ప్రారంభంలో స్వల్పంగా ప్రీమియం ఆదా చేయాలని చూస్తే, పెద్ద ప్రమాదం జరిగినప్పుడు జేబుకు భారీ చిల్లు పడే ప్రమాదముంది.

