Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సత్యవ్రతుడు ‘త్రిశంకువు’అవ్వడానికి వెనుక అసలు కథ ఇదే..!

సత్యవ్రతుడు ‘త్రిశంకువు’అవ్వడానికి వెనుక అసలు కథ ఇదే..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 23 ,2026:సూర్యవంశపు రాజులలో సత్యవ్రతుని కథ అత్యంత విలక్షణమైనది. ఒక మహారాజు కుమారుడై ఉండి కూడా, కాలక్రమంలో ఆయన చేసిన తప్పులు, ఆపై పడిన శాపాల కారణంగా ‘త్రిశంకువు’గా మారవలసి వచ్చింది. మహా తపస్వి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వశిష్ఠుని జీవితాలతో ముడిపడి ఉన్న సత్యవ్రతుని అంతరంగ కథ సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

తండ్రి బహిష్కరణ.. చండాల నివాసం..

మంధాత మహారాజు వంశంలో జన్మించిన త్రయ్యరుణుడికి సత్యవ్రతుడు అనే పరాక్రమవంతుడైన కుమారుడు ఉండేవాడు. అయితే, సత్యవ్రతుడు తొలుత వివేకం కోల్పోయి, అధర్మ మార్గంలో పయనించాడు. ఇతరుల వివాహాలను భగ్నం చేయడం, పరస్త్రీలను అపహరించడం వంటి ఘోర పాపాలకు ఒడిగట్టాడు.

కొడుకు ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన త్రయ్యరుణ మహారాజు, "కులకలంకమైన నువ్వు నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళి చండాలురతో నివసించు" అంటూ సత్యవ్రతుడిని రాజ్యం నుంచి  బహిష్కరించాడు. ఆ సమయంలో రాజ్య పురోహితుడైన వశిష్ఠ మహర్షి కూడా రాజు నిర్ణయాన్ని అడ్డుకోలేదు.

విశ్వామిత్ర కుటుంబానికి ఆపద్బాంధవుడు..

సత్యవ్రతుడు రాజ్యం విడిచి వెళ్ళిన కొన్నాళ్లకే త్రయ్యరుణ మహారాజు కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అయోధ్యలో అధర్మం పెరగడంతో ఇంద్రుని కోపం వల్ల పన్నెండేళ్ల పాటు తీవ్ర కరవు సంభవించింది. అదే సమయంలో, విశ్వామిత్ర మహర్షి తన కుటుంబాన్ని వదిలి సుదీర్ఘ తపస్సుకై వెళ్ళాడు.

కటిక దారిద్ర్యం, ఆకలి తట్టుకోలేక విశ్వామిత్రుని భార్య తన కుమారుడిని వంద ఆవులకు అమ్ముకోవడానికి సిద్ధపడి, అతని మెడకు తాడు కట్టి సంతకు తీసుకువెళ్తోంది. అడవిలో చండాలురతో నివసిస్తున్న సత్యవ్రతుడు ఆ బాలుడిని చూసి, అతను విశ్వామిత్రుని కుమారుడని గ్రహించి రక్షించాడు. ఆ బాలుడి మెడకు తాడు ఉండటం వల్లే అతనికి ‘గాలవుడు’ అనే పేరు వచ్చింది.

సత్యవ్రతుడు విశ్వామిత్రుని కుటుంబంపై కరుణతో, ప్రతిరోజూ అడవి దుంపలను సేకరించి వారికి ఆహారంగా అందించేవాడు. అలాగే, అయోధ్య రాజ్య సంరక్షణ కోసం, తండ్రి లేని లోటు తీర్చడం కోసం పన్నెండేళ్ల పాటు కఠినమైన మౌన వ్రతాన్ని కూడా ఆచరించాడు.

వశిష్ఠునిపై అసంతృప్తి.. మూడు పాపాల శాపం..

మరోవైపు, రాజు లేని అయోధ్యను వశిష్ఠ మహర్షి పర్యవేక్షిస్తున్నాడు. తన తండ్రి తనను బహిష్కరిస్తున్నప్పుడు వశిష్ఠుడు ఆపలేదనే కోపం సత్యవ్రతునిలో ఉండేది. కానీ, సత్యవ్రతుడు కఠోర దీక్ష ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుని, పవిత్రుడైన తర్వాతే అతనికి రాజ్యాన్ని అప్పగించాలనేది వశిష్ఠుని అంతరంగ ఆలోచన. కానీ, సత్యవ్రతుడు ఆ గూఢార్థాన్ని గ్రహించలేకపోయాడు. ఒకరోజు కరవు తీవ్రత వల్ల అడవిలో ఎక్కడా దుంపలు దొరకలేదు. ఆకలితో అలమటించి, వివేకం కోల్పోయిన సత్యవ్రతుడు.. వశిష్ఠుని ఆశ్రమంలోని పవిత్ర గోవు చంపి, దాని మాంసంతో తన ఆకలి తీర్చుకున్నాడు.

ఈ విషయం తెలిసి వశిష్ఠ మహర్షి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సత్యవ్రతునితో ఇలా అన్నాడు.. "ఓరి దుర్మార్గుడా! నువ్వు మూడు ఘోరమైన పాపాలు చేశావు.

మొదటిది.. నీ తండ్రి మనసును గాయపరిచి, ఆయన ఆగ్రహానికి గురికావడం. రెండవది.. గురువు ఆశ్రమంలోని పవిత్రమైన  జంతువును వధించడం. మూడవది.. అపవిత్రమైన ఆ మాంసాన్ని భక్షించడం. నువ్వు ఆ తర్వాతి రెండు పాపాలు చేయకపోయి ఉంటే మొదటి దాన్ని నేను క్షమించేవాడిని. ఈ మూడు శంకువులు అంటే పాపాల  కారణంగా, ఈ రోజు నుంచి నిన్ను ‘త్రిశంకువు’ అని పిలుస్తారు."

ఈ విధంగా, చేసిన పాపాల మూటతో సత్యవ్రతుడు ‘త్రిశంకు’గా మారిపోయాడు. ఆ తర్వాత తపస్సు ముగించుకుని వచ్చిన విశ్వామిత్రుడు, కరవు కాలంలో తన కుటుంబాన్ని కాపాడిన సత్యవ్రతుని (త్రిశంకుని) రుణం తీర్చుకోవడానికి, అతడిని సశరీరంగా స్వర్గానికి పంపేందుకు ప్రయత్నించడం.. ఆపై ‘త్రిశంకు స్వర్గం’ ఏర్పడటం తర్వాతి కథ. పురాణాల ప్రకారం, ఎంతటి సత్కర్మలు చేసినా.. అధర్మం, గురుద్రోహం, వివేకహీనమైన పనులు మనిషిని పతనానికి ఎలా తీసుకెళ్తాయో చెప్పడానికి త్రిశంకువు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: 365Telugu online News