Dailyhunt
5 States Assembly Results:  5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇవే -   3 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 హంగ్

5 States Assembly Results: 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇవే - 3 బీజేపీ, 1 కాంగ్రెస్, 1 హంగ్

ABP దేశం 1 week ago

5 state election results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లో కొత్త మార్పులు తెస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిల్లో బీజేపీ తన జైత్రయాత్రను కొనసాగించగా, కేరళలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పీఠాన్ని దక్కించుకుంది.

అయితే, అందరినీ విస్మయానికి గురిచేస్తూ తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించి, రాష్ట్రాన్ని హంగ్ దిశగా నడిపించింది.

బెంగాల్లో కాషాయ రేఖ - అస్సాంలో హిమంత హ్యాట్రిక్

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు బీజేపీ చరమగీతం పాడింది. సువేందు అధికారి నాయకత్వంలో 200 కంటే ఎక్కువ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి, బీజేపీ అక్కడ మొదటిసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అటు అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన అభివృద్ధి మంత్రంతో వరుసగా మూడోసారి బీజేపీని విజయతీరాలకు చేర్చి హ్యాట్రిక్ నమోదు చేశారు. పుదుచ్చేరిలో కూడా ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది.

కేరళలో మళ్ళీ చేయి - ఎల్డీఎఫ్ పతనం

కేరళలో పినరయి విజయన్ వరుసగా మూడోసారి గెలిచి రికార్డు సృష్టిస్తారన్న అంచనాలను ఓటర్లు తలకిందులు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 100 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. పదేళ్ల కమ్యూనిస్టు పాలనపై ఉన్న అసంతృప్తి, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం, అవినీతి ఆరోపణలు కాంగ్రెస్కు పట్టం కట్టేలా చేశాయి. సతీశన్, చెన్నితల నాయకత్వంలో యూడీఎఫ్ మళ్ళీ కేరళ కోటను హస్తగతం చేసుకుంది.

తమిళనాడులో విజయ్ విప్లవం - హంగ్ ముంగిట రాష్ట్రం

తమిళనాడు ఫలితాలు ఈ ఎన్నికల్లోనే అత్యంత సంచలనంగా మారాయి. ఎవరూ ఊహించని విధంగా నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం 109 స్థానాల్లో ముందంజలో ఉండి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ తన కంచుకోట కొలత్తూరులో ఓడిపోవడం డీఎంకే పతనానికి నిదర్శనంగా నిలిచింది. అన్నాడీఎంకే 55 స్థానాలతో, డీఎంకే 52 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ పార్టీకీ 118 మార్కు అందకపోవడంతో, విజయ్ ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ముగిసిన ద్రవిడ యుగం - కొత్త శకానికి నాంది

ఈ ఐదు రాష్ట్రాల తీర్పు భారత రాజకీయాల్లో స్పష్టమైన మార్పును సూచిస్తోంది. వారసత్వ రాజకీయాలను, సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. బెంగాల్లో మమత, కేరళలో విజయన్, తమిళనాడులో స్టాలిన్ వంటి దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. అభివృద్ధిని, కొత్త ముఖాలను ఆదరిస్తూనే.. జాతీయ స్థాయిలో బీజేపీ పట్టును, ప్రాంతీయ స్థాయిలో విజయ్ వంటి కొత్త శక్తుల ఎదుగుదలను ఈ ఎన్నికలు ధృవీకరించాయి. రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై జరిగే రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించనున్నాయి.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam