TTD 5000 Temples Construction: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ, దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు.
దీనికి సంబంధించి పూర్తి సమాచారం...
రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల దేవాలయాల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయాల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాలు త్వరలోనే ఖరాలు చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. ఆధ్యాత్మికతను మరింత ప్రోత్సహించేలా TTD కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. APలో ఆలయాల నిర్మాణం, TTD ఆధ్వర్యంలో ధార్మిక, విద్య, వైద్య సేవలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లాల్లో 161 నియోజకవర్గాల నుంచి 4,192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర సీఎంకు వివరించారు. 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందని 3 కేటగిరీలుగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల కాలనీలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ ఆలయాలు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే నిధులను కూడా ఆలయాల నిర్మాణానికి వినియోగించాలని, శ్రీవారి సేవకుల సేవలు వినియోగించుకోవాలని, భక్తుల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. TTD సభ్యులు, భక్తులు, శ్రీవారి సేవకులతో ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలన్నారు. మారిషన్ వంటి దేశాలు స్వామివారి ఆలయాలు నిర్మించాలని కోరుకుంటున్నాయి..భవిష్యత్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారేలా కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
కొత్త నిర్మించే ఆలయాల్లో విగ్రహాల ఏర్పాటు, అర్చకుల శిక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 1000 పాత ఆలయాలను పునరుద్ధరించాలని, శివాలయాలు, శక్తి పీఠాల అభివృద్ధిపైనా దృష్టి పెట్టాలన్నారు. అన్ని ఆలయాలకు సంబంధించిన వివరాలను డిజిటలైజ్ చేయాలన్నారు.
దేవాదాయశాఖ పరిధిలో ఉన్న 28 వేల ఆలయాలు, TTD నిర్వహిస్తున్న 65 ఆలయాలతో పాటు కొత్తగా నిర్మించే 5 వేల ఆలయాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక అవసరం అన్నారు.
TTD నిర్వబిస్తున్న అన్నదానం, శ్రీవారి సేవకుల సేవలు, ఆలయాల నిర్మాణం వంటి కార్యక్రమాలను హిందూ ధర్మ ప్రచారంతో అనుసంధానిస్తూ మరింత విస్తృతం చేయాలన్నారు
TTDలో ఎన్టీఆర్ ప్రారంభించిన అన్నదానం కార్యక్రమం గొప్ప సేవా కార్యక్రమంగా మారిందని చెప్పారు. ప్రాణదానం ట్రస్టు ను టీటీడీ వైద్య సేవలకు బెస్ట్ మోడల్ గా తయారు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
నిపుణులైన వైద్యుల సేవల్ని కూడా వినియోగించుకోవాలన్నారు. TTD పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల సేవల్ని అనుసంధానించాలని.. కేన్సర్ , కంటి వైద్యం సహా తిరుపతిలోని ఆయుర్వేద వైద్య సేవల్ని కూడా విస్తృతం చేయాలన్నారు. వైద్యులను శ్రీవారి సేవకులుగా మార్చి వైద్య సేవలతో పాటు బోధన కార్యక్రమాల్లోని సేవల్ని వినియోగించు కోవాలన్నారు.
TTD పరిధిలోని 33 విద్యా సంస్థల వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. విద్య, వైద్యం, సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు.
తిరుమలతో పాటు తిరుపతిని కూడా సంపూర్ణ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఆధ్యాత్మికత, పవిత్రత ప్రతిబింబించేలా ప్రత్యేక ఎకోసిస్టమ్ రూపొందించాలని ,నిపుణులైన భక్తుల భాగస్వామ్యంతో TTD సేవలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చూడాలన్నారు. వర్చువల్ గా జరిగిన ఈ సమీక్షకు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, TTD ఈఓ ముద్దాడ రవిచంద్ర, దేవాదాయశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు
Author : RAMA

