ABP Networks India at 2047 | న్యూఢిల్లీ: ఏబీపీ నెట్వర్క్ ఫ్లాగ్షిప్ 'ఇండియా @ 2047 కాన్క్లేవ్' జూన్ 3న న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు.
స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా సాగిస్తున్న ప్రయాణంపై చర్చించేందుకు రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, సినీ, సాంస్కృతిక ప్రముఖులను ఏబీపీ నెట్వర్క్ ఒకే వేదికపైకి తీసుకురానుంది. బిల్డింగ్ భారత్ @ 2047 (Building Bharat @ 2047) అనే థీమ్తో జరిగే ఈ కాన్క్లేవ్లో దేశంలో మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence), సుపరిపాలన, ఇంధన వినియోగంలో మార్పులపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, సినీ, ఇతర రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. వచ్చే రెండు దశాబ్దాలలో భారత్ అభివృద్ధి పథాన్ని తీర్చిదిద్దగల విధానాలు, ఆలోచనలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు..
మౌలిక సదుపాయాలు, ఏఐ (AI) లపై స్పెషల్ ఫోకస్
జూన్ 3న జరగనున్న ఈ కాన్క్లేవ్ మౌలిక సదుపాయాలకు నిధులు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పై చర్చతో ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి, భారత దీర్ఘకాలిక వృద్ధి ఆకాంక్షలకు మద్దతు ఇచ్చే మార్గాలను ఈ ఈవెంట్ అన్వేషించనుంది. ఇప్పటివరకూ పురుషుల ఆధిపత్యం ఉండే రంగాలలో మారుతున్న ఆఫీస్ డైనమిక్స్ను, మౌలిక సదుపాయాల రంగంలో మహిళల పాత్రను ఒక ప్రత్యేక ప్యానెల్ ద్వారా చర్చిస్తారు. భారత మొట్టమొదటి ఆల్-ఉమెన్ అండర్గ్రౌండ్ మైన్ రెస్క్యూ టీమ్లో భాగమైన నేహాల్ సోలంకితో పాటు ట్రక్ డ్రైవర్ యోగితా రఘువంశీ, పోర్ట్ ఆపరేటర్ ఎల్. కార్తీక, వేదాంత ఎగ్జిక్యూటివ్ సింధు పాండ్రే ఈ సెషన్లో పాల్గొంటారు.
ఆర్థిక, సాంకేతికతపై దృష్టి సారించడంపై సైతం ఈ వేదికపై చర్చిస్తారు. ఆర్థికవేత్త సుర్జిత్ సింగ్ భల్లా ప్రపంచ ఆర్థిక సవాళ్లు, భారత్పై వాటి ప్రభావాలపై మాట్లాడతారు. పీక్ XV,సెర్జ్కి చెందిన రాజన్ ఆనందన్ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాత్రపై చర్చిస్తారు. నీతి ఆయోగ్ నుంచి దేబ్జాని ఘోష్ డిజిటల్ మౌలిక సదుపాయాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తారు. చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్కు చెందిన శిశిర్ ప్రియదర్శి ఆర్థిక వృద్ధి, కర్బన ఉద్గారాల తగ్గింపు మధ్య బ్యాలెన్సింగ్పై ప్రసంగిస్తారు.
కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు
దేశంలో సుపరిపాలన, ప్రజా విధానాలపై దృష్టి సారించే సెషన్లలో పలువురు సీనియర్ రాజకీయ నాయకులు పొల్గొనున్నారు. కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, సీఆర్ పాటిల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సెషన్లో పాల్గొని సముద్ర అనుసంధానత (మారిటైమ్ కనెక్టివిటీ), నీటి వనరులు, భారత విమానయాన రంగ భవిష్యత్తుపై చర్చిస్తారు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభివృద్ధితో పాటు సుపరిపాలనపై తమ ఆలోచనల్ని ప్రజలతో పంచుకోనున్నారు.
హాజరుకానున్న మనోజ్ బాజ్పాయ్, ఇంతియాజ్ అలీ
ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ఈ కాన్క్లేవ్లో సంస్కృతి, స్టోరీ టెల్లింగ్ పై కూడా చర్చలు జరుగతాయి. సినిమా రంగంలో రియల్ లైఫ్ హీరోల జీవితాలను తెరకెక్కించడంపై సెషన్లో నటుడు మనోజ్ బాజ్పాయ్ పాల్గొనున్నారు. మారుతున్న భారత సాంస్కృతిక గుర్తింపు, ప్రజా చర్చలను తీర్చిదిద్దడంలో స్టోరీ టెల్లింగ్ పాత్రపై సినీ నిర్మాత ఇంతియాజ్ అలీ తన ఆలోచనలను పంచుకుంటారు.
ప్రభుత్వం, వ్యాపార, సాంకేతిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకురావడం ద్వారా వికసిత్ భారత్ 2027 వైపు పయనంంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉన్న అవకాశాలపై విస్తృతమైన చర్చకు అవకాశం కల్పించడం ఈ కాన్క్లేవ్ ముఖ్య ఉద్దేశం.
Author : Shankar Dukanam

