Adilabad Chit Fund Scam | ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కనకదుర్గ చిట్ఫండ్స్ బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. చిట్ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి ఏళ్ల తరబడి తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న 93 మంది బాధితులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (ఐపీఎస్) చొరవతో మొత్తం ₹2,34,59,991 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
కనకదుర్గ చిట్ఫండ్స్ యాజమాన్యం బాధితుల డబ్బులను సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అందిన ఫిర్యాదుల మేరకు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి చర్యలు చేపట్టారు.

93 మంది బాధితులకు చెక్కుల పంపిణీ..
ఈ చిట్ ఫండ్స్ అక్రమాల కేసుకు సంబంధించి మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన నిందితుడు, బాధితులందరికీ రావలసిన మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అంగీకరించాడు. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 93 మంది బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రజలు అధిక లాభాల ఆశ చూపే మోసపూరిత పెట్టుబడి పథకాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చట్టబద్ధంగా నమోదైన చిట్ఫండ్ కంపెనీలలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని, ఏ సంస్థలోనైనా డిపాజిట్ చేసే ముందు దాని చట్టబద్ధతను నిర్ధారించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు.

కష్టపడి దాచుకున్న సొమ్ము నిలిచిపోయి తీవ్ర నిరాశలో ఉన్న తమకు తిరిగి డబ్బులు అందేలా నిరంతరం శ్రమించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్తో పాటు జిల్లా పోలీసు సిబ్బందికి బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, కనకదుర్గ చిట్ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Author : Shankar Dukanam

