Andhra Pradesh And Telangana Weather: వాతావరణ శాఖ చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వానలు హడలెత్తించినా మిగతా ప్రాంతాల్లో మాత్రం జల్లులు ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
ఎగువ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పుడు అవి కూడా శాంతించాయి.
హైదరాబాద్ను ముంచెత్తిన వాన
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం, రాత్రి కుండపోత వాన కురిసింది. కేవలం కొన్ని గంటల్లోనే సరూర్నగర్ ఉప్పల్, మాధాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ బీభత్సం సృష్టించింది. దీని వల్ల రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.
తెలంగాణలో తేలికపాటి వానలు
తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి, మెదక్, హనుమకొండ, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పిడుగుల వాన
ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచించారు.
గోదావరికి తగ్గిన వరద
గోదావరి కొన్ని రోజుల పాటు ఉగ్రరూపంతో భయపెట్టింది. కానీ ఇప్పుడు శాంతిస్తుండగా, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ రాయలసీమ ప్రాజెక్టుల వైపు పరుగులు తీస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్ట ఒక దశలో 55.90 అడుగులకు చేరింది. దీని వల్ల సుమారు 15,84,657 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగింది. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వాలు తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎగువన వర్షాలు తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం భారీగా తగ్గడంతో వేలేరుపాటు, కుక్కునూరు, మండలాల్లో వరద తగ్గుముఖం పట్టింది. వరద నీటిలో మునిగిపోయిన రహదారులు బయట పడుతుండటంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.
కృష్ణలో పెరుగుతున్న వరద
గోదావరి తగ్గుతున్నా, కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. రాయలసీమకు గుండెకాయ వంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేరటర్ వద్దకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ చేరుకుంది. శ్రీశైలం జలాశయంలోకి జూరాల నుంచి 1.71 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి మట్టం 854.5 అడుగులకు చేరింది.
ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న రైతులకు ఈ వర్షాలు వరదలు కాస్త ఊరటనిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.81టీఎంసీలు కాగా, ప్రస్తుతం 92.04 టీఎంసీలు నీరు ఉంది. ఇే వేగంతో వరద కొనసాగితే పది రోజుల్లో శ్రీశైలం నిండే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. తుంగభద్ర జలాశయానికి కూడా ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల 13,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది రుతుపవనాలు నెమ్మదించాయి. జూలై ఆరంభంలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, నెలాఖరుకు వచ్చేసరికి ఉద్ధృతి పెరిగింది. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీరు శ్రీశైలం వంటి ప్రాజెక్టులు నిండటం సాగు నీటి అవసరాలకు సానుకూల అంశం.
Author : Khagesh

