Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP High Court : యువ న్యాయవాదిపై పోలీసు కస్టడీ ఆదేశాలు-  ఏపీ హైకోర్టు జడ్జిపై చర్యలకు బి.సి.ఐ డిమాండ్

AP High Court : యువ న్యాయవాదిపై పోలీసు కస్టడీ ఆదేశాలు- ఏపీ హైకోర్టు జడ్జిపై చర్యలకు బి.సి.ఐ డిమాండ్

ABP దేశం 2 weeks ago

BCI Seeks Withdrawal Of Judicial Work of AP High Court Judge: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటుచేసుకున్న ఒక వివాదాస్పద ఘటనపై భారత బార్ కౌన్సిల్ (BCI) తీవ్రంగా స్పందించింది.

యువ న్యాయవాదిని పోలీసు కస్టడీకి పంపాలని ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి లేఖ రాసింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక యువ న్యాయవాది పట్ల అనుచితంగా వ్యవహరించి, పోలీసు కస్టడీకి ఆదేశించిన న్యాయమూర్తి జస్టిస్ టి. రాజశేఖరరావుపై చర్యలు తీసుకోవాలని భారత బార్ కౌన్సిల్ (BCI) డిమాండ్ చేసింది. కోర్టు విచారణ సమయంలో ఒక ఉత్తర్వు ప్రతిని సమర్పించలేదనే కారణంతో 24 గంటల పాటు పోలీసు కస్టడీకి ఆదేశించడం న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ బి.సి.ఐ చైర్మన్, సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

కోర్టు హాల్లో యువ న్యాయవాదిని మందలిస్తూ, పోలీసు కస్టడీకి పంపుతామని బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ న్యాయవాది పదేపదే క్షమాపణలు కోరినప్పటికీ, న్యాయమూర్తి వినకుండా కస్టడీకి ఆదేశించడంపై బి.సి.ఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్య న్యాయవ్యవస్థకు ఉండాల్సిన సంయమనం, నిష్పాక్షికత , న్యాయవాద వృత్తి గౌరవానికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. కేవలం ఒక విధానపరమైన లోపం జరిగినందుకు యువ న్యాయవాదిని జైలుకు పంపాలని చూడటం ప్రాథమికంగా అత్యంత అనుచితం అని బి.సి.ఐ స్పష్టం చేసింది.

బెంచ్, బార్ మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవానికి ఇటువంటి సంఘటనలు గొడ్డలి పెట్టు వంటివని బార్ కౌన్సిల్ హెచ్చరించింది. న్యాయవాది బహిరంగంగా కోర్టులో వేడుకుంటున్నప్పటికీ, కనికరం లేకుండా కస్టడీకి పంపడం వల్ల యువ న్యాయవాదుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు గౌరవం అనేది ఒక న్యాయవాదిని వేడుకునేలా చేయడం వల్ల పెరగదు అని బి.సి.ఐ తన లేఖలో వ్యాఖ్యానించింది.

బి.సి.ఐ ప్రధాన డిమాండ్లు

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన భారత బార్ కౌన్సిల్, సి.జె.ఐకి మూడు ప్రధాన ప్రతిపాదనలు చేసింది
1. సదరు న్యాయమూర్తి నుండి వెంటనే న్యాయ విధుల (Judicial Work) ను ఉపసంహరించుకోవాలి.
2. ఆయనను తక్షణమే సుదూర ప్రాంతంలోని మరేదైనా హైకోర్టుకు బదిలీ చేయాలి.
3. కోర్టు నిర్వహణ, న్యాయమూర్తికి ఉండాల్సిన సంయమనం తదితర అంశాలపై ఆయనకు ప్రత్యేక న్యాయ శిక్షణ ఇప్పించాలి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్ను పరిశీలించి, తగిన పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని బి.సి.ఐ కోరింది. న్యాయవ్యవస్థలో ఇటువంటి ధోరణులు పెరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టుకు విన్నవించింది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam