Assembly Election Results 2026 | న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో గత నెల రోజులుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి.

Assembly Election Results 2026 | న్యూఢిల్లీ: దేశంలోని 4 రాష్ట్రాలు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో గత నెల రోజులుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానున్నాయి.
ఎన్నికల సంఘం ఐదు అసెంబ్లీలలో నాల్గింటిలో ఒకే దశలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగా, 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో ఎన్నికలు జరిగాయి. కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించింది, అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగగా, బెంగాల్ రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29న నిర్వహించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో దాదాపు 823 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానం మినహా మిగతా చోట్ల ఓట్ల లెక్కించి ఈసీ ఫలితాలు వెల్లడించనుంది.
ఓట్ల లెక్కింపునకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెంగాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా, తమిళనాడులో DMKకి చెందిన MK స్టాలిన్ మళ్లీ అధికారం సొంతం చేసుకుంటారా అనేది కొన్ని గంటల్లో తేలనుంది. అస్సాం, కేరళలలో వరుసగా హిమంత బిస్వా శర్మ, పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వాలు దీమాగా ఉన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ డేటాలో ఫలితాల అంచనాలు ఏమిటి?
పశ్చిమ బెంగాల్: బెంగాల్లో చాలా ఎగ్జిట్ పోల్స్ TMCకి షాక్ తగులుతుందని, బీజేపీకి భారీ విజయాన్ని అంచనా వేశాయి. అయితే, TMC ఈ అంచనాలను తోసిపుచ్చింది. 200 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
తమిళనాడు: చాలా ఎగ్జిట్ పోల్స్ అధికారంలో ఉన్న MK స్టాలిన్ నేతృత్వంలోని DMK కూటమి తమిళనాడులో తిరిగి వస్తుందని అంచనా వేయగా, తలపతి విజయ్ పార్టీ తమిళగా వెట్రి కజగం (TVK) కూడా మెరుగైన ప్రదర్శన చేస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం, TVK 98-120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే DMK కూటమి 92-100 సీట్లు, AIADMK నేతృత్వంలోని NDA కేవలం 22- 32 సీట్లకు పరిమితం కానుంది.
కేరళ: కేరళలో చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని UDF రాష్ట్రంలో అధికారంలోకి రానుంది. యాక్సిస్ మై ఇండియా UDFకి 78-90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మనోరమ సి-ఓటర్ ప్రకారం ఈ సంఖ్య 94 సీట్లు. 140 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 71 కాగా ఇందులో LDFకి 44-62 సీట్లు వస్తాయని అంచనా. అయితే బీజేపీ నేతృత్వంలోని NDA కేరళలో తక్కువ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
అస్సాం: అస్సాంలో, అన్ని ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు సీఎం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ప్రకారం, NDA 88-100 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమి 24- 36 సీట్లు గెలిచే అవకాశం ఉంది. మ్యాట్రిక్స్ ప్రకారం, NDA 85- 95 సీట్లు, కాంగ్రెస్ కూటమి 25-32 సీట్లు, ఇతరులు 12 సీట్ల వరకు గెలుచుకోవచ్చు.
పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం NDA అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. పీపుల్స్ పల్స్ ప్రకారం, 30 అసెంబ్లీ స్థానాల్లో NDA 15-19 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
Author : Shankar Dukanam