కరీంనగర్: విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్లకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ (ఉత్తరాది, దక్షిణాది అని వ్యత్యాసం లేకుండా) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ ఘన విజయం..
నేడు 4 రాష్ట్రాలు కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ఫలితాలపై బండి సంజయ్ స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి లభిస్తున్న ఆదరణే ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి భయాలు ఉండవన్నారు. పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ విజయం సాధిస్తుండగా.. పుదుచ్చేరిలో అధికారం సొంతం చేసుకుంది. అస్సాంలో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకుని సత్తా చాటింది. తమిళనాడులో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
ఇలాంటి విషయాలపై రాజకీయాలు చేస్తారా.. బండి సంజయ్ ఆగ్రహం..
కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన కొందరు నేతలు, ఈ ఘటనను కూడా రాజకీయ కోణంలో చూడటం సిగ్గుచేటన్నారు. కాల్పుల ఘటన జరిగాక తాము ఇప్పటికే జ్యువెలరీ దుకాణ యాజమాన్యంతో మాట్లాడామని, బాధిత కుటుంబాలకు పూర్తి అండగా నిలవాలని కోరినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు.
Author : Shankar Dukanam

