BCB Letter: గత కొంతకాలంగా భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.
బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్, క్రీడా శాఖ మంత్రి నజ్ముల్ హక్ ఆధ్వర్యంలో భారత్తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు బీసీసీఐకి బీసీబీ లెటర్ రాసింది.
భారత్తో సిరీస్లు జరగకపోతే బంగ్లాదేశ్ బోర్డు భారీగా ఆదాయాన్ని కోల్పోతుంది. వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఆసియా కప్కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఒక వేళ భారత్ అక్కడికి వెళ్లడానికి నిరాకరిస్తే, టోర్నీని దుబాయి లేదా, శ్రీలంకకు తరలించాల్సి వస్తుంది. ఇది బంగ్లాదేశ్కు పెద్ద ఎదురు దెబ్బ కానుంది. గత ఏడాది వాయిదా పడిన భారత పర్యటనను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
ముస్తాఫిజుర్ రెహమాన్,వరల్డ్ కప్ బాయ్కట్
ఈ వివాదం ఎక్కడ మొదలైందో అర్థం చేసుకోవాలంటే 2025చివరి నాటి పరిస్థితులు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఘర్షణ ఐపీఎల్ వివాదంతో మొదలైంది. ఐపీఎల్ 2026 వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా భారత్లో నిరసనలు వెల్లువెత్తడంతో, బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.
దీనికి ప్రతి చర్యగా తమ ఆటగాళ్లు భారత్లో భద్రత లేదంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు 2026 టీ 20 వరల్డ్ క్ కోసం భారత్ పర్యటనను నిరాకరించాయి. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేశాయి. అయితే ఐసీసీ ఈ డిమాండ్ను తిరస్కరించి బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు టోర్నీలో ఛాన్స్ కల్పించింది.
సెప్టెంబర్ పర్యటనపై ఉత్కంఠ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన తాజా ఇటినెరరీలో టీమ్ ఇండియా పర్యటనను చేర్చింది. ఆగస్టు 28న భారత్ జట్టు బంగ్లాదేశ్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 1, 3 , 6 తేదీల్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో టీ 20 మ్యాచ్లు ఆడనుంది. ఈ టూర్ గత ఆగస్టులో జరగాల్సింది కానీ అక్కడ రాజకీయ అలజడి కారణంగా ఈ సెప్టెంబర్కు వాయిదా పడింది. ఇప్పుడు ఈ సిరీస్ జరుగుతుందా లేదా అనేది బీసీసీఐ, భారత్ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఎత్తివేతతో సానుకూల సంకేతాలు
సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా బంగ్లాదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఐపీఎల్ ప్రసారాలై విధించిన ఆంక్షలను సడలించింది. క్రీడలకు రాజకీయాలతో ముడిపెట్టకూడదని తాము భావిస్తున్నామని, కమర్షియల్ ప్రాతిపదికన ఏ ఛానెల్ అయినా ఐపీఎల్ ప్రసారం చేసుకోవచ్చని బంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి జాహిర్ ఉద్దీన్ స్వపన్ ప్రకటించారు.ఇది బీసీసీఐతో సత్సంబంధాల పునరుద్ధరణకు ఒక ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
బీసీసీఐ, ఐసీసీ స్పందన
బీసీసీఐ ప్రస్తుతానికి ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. బంగ్లాదేశ్ బోర్డు నుంచి లేఖ అందిన మాట వాస్తమేనని ధృవీకరించినప్పటికీ, వేదికల ఖరారు లేదా సిరీస్ నిర్వహణ పూర్తిగా భారత్ ప్రభుత్వ విదేశాంగ విధానంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
మరోవైపు ఐసీసీ ఛైర్మన్ జైషా ఈ వివాదంలో తటస్థంగా వ్యవహరించారు. వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలనేది బంగ్లాదేశ్ సొంత నిర్ణయమని, దీనిపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే భవిష్యత్లో బంగ్లాదేశ్కు ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Author : Khagesh

