Top Stories | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు..
AP Liquor Scam: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్- విచారణ 13కి వాయిదా!
AP Liquor Scam: ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో A-2 రాజ్ కెసిరెడ్డి పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది. నిందితులు వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, కారుమూరి సునీల్ను వారం రోజులు కస్టడీ కోరుతూ ఈడీ మరో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.
కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయండి, ఏదైనా జరిగితే బీఆర్ఎస్దే బాధ్యత – జగదీష్ రెడ్డి
కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేయడం ద్వారా రాష్ట్రాన్ని సూపర్ ఎల్నినో ప్రభావం నుండి, కరవు పరిస్థితుల నుండి రక్షించవచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. పంప్ ఆన్ చేసి నీళ్లు నింపాలని, ప్రాజెక్టుకు ఏమైనా జరిగితే బీఆర్ఎస్ పార్టీదే బాధ్యత అని, రాజీకీయాల నుంచి తప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాము చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై ప్రభుత్వం తరఫున నలుగురు మంత్రులు స్పందించారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ మంత్రులలో ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలమనే కనీస అవగాహన, బాధ్యతతో మాట్లాడలేకపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
రైతుల ప్రయోజనాలను పక్కనబెట్టి మంత్రులంతా కేవలం పాత సొల్లు, బూతు పురాణాలతోనే కాలక్షేపం చేస్తూ రాజకీయం చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రదేశంలోనే ఎల్లప్పుడూ నీళ్లు అందుబాటులో ఉంటాయనే శాస్త్రీయ దృక్పథంతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గా అదే ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆయన సమర్థించారు.
రేపు, ఎల్లుండి వైఎస్సార్ జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (జూలై 7, 8 తేదీల్లో) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు (జూలై 7న) పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్భార్లో పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. అనంతరం ఎల్లుండి (జూలై 8న) వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన ఇడుపులపాయ నుంచి నేరుగా బెంగళూరుకు తిరుగు ప్రయాణమవుతారు.
సంథ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్కు స్వల్ప ఊరట..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై సోమవారం నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కు వర్చువల్ గా అటెండ్ అవ్వడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. నేడు జరిగిన విచారణకు కొంత మంది నిందితులు వ్యక్తిగత కారణాలతో విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ ఈ నెల 29 కి వాయిదా వేసింది. 23 మంది నిందితులకు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందజేశారు. ముంబై షూటింగ్ లో ఉండడం తో అల్లు అర్జున్2కు వర్చువల్ గా హాజరుకు కోర్టు పర్మిషన్ ఇచ్చింది.
ఆక్వా రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ సంఘీభావం.. ఈ 15న భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
ఆక్వా రైతుల పోరాటానికి వైఎస్సార్సీపీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్లకు మద్దతుగా ఈ పర్యటన సాగనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నేరుగా ఆక్వా రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. భీమవరంలో జరగబోయే వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి
పులివెందులలో రోడ్డుపైనే ఊడిపోయిన స్కూల్ బస్ టైర్లు
కడప జిల్లా పులివెందులలో ఒక స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు వెళ్తుండగా అకస్మాత్తుగా రెండు టైర్లు విడిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సుల ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు చేయడం లేదని, ప్రైవేటుకు బాధ్యతలు అప్పగించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.
విజయవాడలో కాల్ మనీ రాకెట్– ఎంపీ కేశినేని చిన్ని, ముల్పూరి కిశోర్లపై సీఎంకు కేశినేని నాని లేఖ
విజయవాడలో "కాల్ మనీ" సిండికేట్ పేరిట ఎంపీ కేశినేని చిన్ని, ఆయన అనుచరుడు ముల్పూరి కిశోర్ సాగిస్తున్న అరాచకాలపై మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. చాగర్ల గాయత్రి అనే మహిళ రూ. 5 కోట్ల అప్పుకు రూ. 21 కోట్లు చెల్లించినా, అదనంగా మరో రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఆమె 11 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి, ప్రాణాలతో బెదిరించడానికి ఎంపీ అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కిశోర్పై తక్షణమే పీడీ యాక్ట్ ప్రయోగించాలని, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని నాని డిమాండ్ చేశారు.
ఒక్క బిల్డింగ్ కూల్చితే వంద కడతాం: అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: ‘అనాథలు, పేదలకు ఉచిత విద్యనందిస్తున్న భవంతిని కూల్చితే, మరో పది భవంతులు నిర్మిస్తానని’ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. బండ్లగూడలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముస్లింలలో నిరక్షరాస్యతను దూరం చేస్తున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆరోపించారు. ఒకవేళ భవంతులు కోల్పోయినా, విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టైనా చదువు చెప్పిస్తానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించింది. ఆమె భక్తికి చలించిన టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఆమె వివరాలు కనుక్కోవాలని కోరగా.. విజిలెన్స్ అధికారులు ఆమెను చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు.
చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆమెకు పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందించి, కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అద్భుత అవకాశానికి నవనీతమ్మ కుటుంబ సభ్యులు టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు.
Author : Shankar Dukanam

