Rare white bull Dhaka Zoo: బంగ్లాదేశ్‌లో బక్రీద్ త్యాగాల కోసం సిద్ధం చేసిన కోట్లాది జంతువుల మధ్య 700 కిలోల బరువున్న ఒక తెల్లటి ఎనుబోతు అందరి దృష్టిని ఆకర్షించింది.
దీని యజమాని జియా ఉద్దీన్ మృధా సోదరుడు, ఆ జంతువు తలపై ఉన్న జుట్టు డొనాల్డ్ ట్రంప్ సిగ్నేచర్ హెయిర్ స్టైల్ తరహాలో ఉండటంతో దీనికి ట్రంప్ అని పేరు పెట్టారు. అరుదైన అల్బినో రకానికి చెందిన ఈ ఎనుబోతు సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్‌గా మారింది. పిల్లలు, పెద్దలు దీనితో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.
చివరి నిమిషంలో ప్రభుత్వ ఎంట్రీ
కేరళీగంజ్ ప్రాంతానికి చెందిన మృధా ఈ ఎనుబోతును ఇప్పటికే బక్రీద్ బలి కోసం విక్రయించారు. గురువారం నాడు దీనిని కోయాల్సి ఉండగా, కొన్ని గంటల ముందే ప్రభుత్వం జోక్యం చేసుకుంది. బంగ్లాదేశ్ పశుసంవర్ధక శాఖ అధికారులు కేరళీగంజ్ పోలీసుల సాయంతో యజమానిని సంప్రదించి, ఇది అత్యంత అరుదైన జంతువు అని, దీనిని బలి ఇవ్వకుండా కాపాడాలని కోరారు. ఇది ఇంకా వయసులో చిన్నది కాబట్టి, మరికొన్ని ఏళ్లు పెంచవచ్చని సూచించి దీనిని స్వాధీనం చేసుకున్నారు.
జూలో స్పెషల్ కేర్
ప్రభుత్వం కాపాడిన ఈ ట్రంప్ ఎనుబోతును నేరుగా ఢాకాలోని జాతీయ జూ పార్కుకు తరలించారు. అక్కడ దీని కోసం ప్రత్యేకంగా ఒక షెడ్, ఒక కేర్ టేకర్‌ను కూడా కేటాయించారు. ప్రస్తుతానికి దీనిని రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచి, ఆ తర్వాత సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బలి పీఠం ఎక్కాల్సిన ఈ జంతువు ఇప్పుడు జూలో ఒక సెలబ్రిటీగా తన జీవితాన్ని కొనసాగించబోతోంది.
త్యాగాల వేళ వింత ఘటన
సాధారణంగా బక్రీద్ నాడు బంగ్లాదేశ్‌లో దాదాపు 1.2 కోట్ల జంతువులను బలి ఇస్తారు. అయితే, ఈ ట్రంప్ ఎనుబోతు దాని రూపం వల్ల ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది. జంతువు ప్రాణాలను కాపాడటంతో పాటు, దాని అరుదైన జన్యువులను రక్షించడం కూడా ముఖ్యమని అధికారులు భావించడం విశేషం.
Author : Raja Sekhar Allu

