Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీయే కూటమి వైభవం కొనసాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న ఆధిపత్య పోరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారింది.
అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశమే తప్ప, అది అహంకారానికి వేదిక కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది వారికి తెలుసు అంటూ నేతలకు చురకలు అంటించారు. కేవలం ఫ్లెక్సీల్లో ఫోటోల కోసం, కుర్చీల కోసం గొడవపడటం తనను తీవ్రంగా బాధించిందని, ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని కరాఖండిగా చెప్పారు.
పిఠాపురం ఫ్లెక్సీ సెగలు.. వర్మకు పరోక్ష హెచ్చరిక!
ఈ వివాదానికి ప్రధాన కేంద్రంగా పిఠాపురం నియోజకవర్గం నిలిచింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు, జనసేన నేతలకు మధ్య ఫ్లెక్సీల విషయంలో జరిగిన తోపులాట రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి ఫోటో చిన్నదిగా ఉందనో, లేదనో వర్మ అనుచరులు అధికారులను నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. చంద్రబాబు ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కలసి సాగడమే లక్ష్యం తప్ప ఆధిపత్యం కోసం కాదు అని పేర్కొనడం వర్మ వంటి నేతలకు డైరెక్ట్ మెసేజ్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కూటమి ధర్మం vs వ్యక్తిగత పంతాలు
ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒకే గొడుగు కింద ఉన్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య పాత కక్షలు ఇంకా సమసిపోలేదు. గతంలో ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే వేదికపై కూర్చోవాల్సి రావడంతో ప్రోటోకాల్ పేరుతో ఈగోలు బయటపడుతున్నాయి. నేను ఒక యజ్ఞం చేస్తుంటే.. మనవాళ్లే సరిగా ప్రవర్తించకపోతే రాక్షసులకు అవకాశం ఇచ్చినట్లవుతుంది అని బాబు వ్యాఖ్యానించడం ద్వారా కూటమి ఐకమత్యాన్ని దెబ్బతీసే వారిపై కఠినంగా ఉంటామని సంకేతమిచ్చారు.
క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు!
కేవలం మాటలతోనే కాకుండా, నరసరావుపేట వంటి చోట్ల జరిగిన క్రమశిక్షణా రాహిత్య ఘటనలపై ఇప్పటికే బాబు యాక్షన్ మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక బాధ్యత అని, దానిని విస్మరించి విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలికారు. అధికార గర్వంతో విర్రవీగే నాయకుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, అలాంటి వారిని పక్కన పెట్టడానికి కూడా వెనకాడబోనని ఆయన హెచ్చరించారు.
క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందా?
చంద్రబాబు హెచ్చరికలు పైస్థాయి నేతలకు బాగానే అర్థమవుతున్నా, గ్రామ స్థాయిలోని ద్వితీయ శ్రేణి నాయకులు దీనిని ఎంతవరకు జీర్ణించుకుంటారనేది ప్రశ్నార్థకం. పిఠాపురం వర్మ లాంటి నేతలు తమ క్యాడర్ను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు కూటమి ధర్మానికి అడ్డంకిగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటి ఇగోలను పక్కన పెట్టి టీమ్ ఏపీగా పని చేయకపోతే, స్వర్ణాంధ్ర లక్ష్యం కుంటుపడుతుందనే ఆందోళన ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు విజన్ చాలా స్పష్టంగా ఉంది.. ఆయన రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, నేతలు మాత్రం చిన్న చిన్న ఫోటోల కోసం కొట్టుకోవడం ఆయనకు అసహనాన్ని కలిగిస్తోంది. ఈ డిసిప్లిన్ క్లాస్ తర్వాత అయినా నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి!
Author : Raja Sekhar Allu

