Lyricist Chandrabose Brother Death Suspicious : ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వార్తలు వచ్చినా... శరీరంపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలేేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుండిగల్ మండల పరిధి బౌరంపేటలోని డాలర్ డ్రీమ్స్లో రాజేందర్, వసంత దంపతులు నివాసం ఉంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేంద్ర... గత నెల 18న బెంగుళూరుకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. ఆదివారం ఏపీలోని అన్నమయ్య జిల్లా కలికిరి రోడ్డుపై రాజేందర్ మృతి చెందినట్లు ఫ్యామిలీ మెంబర్స్కు ఆ ప్రాంత పోలీసులు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని ఇక్కడికి తరలించి బాచుపల్లిలోని మమతా ఆస్పత్రిలో భద్రపరిచారు.
రాజేందర్ శరీరంపై గాయాలు ఉండటంతో ఆయన మృతి అనుమానాస్పదంగా మారింది. ఈ మేరకు ఆయన భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటుతో...
తొలుత రాజేందర్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు భావించారు. కలికిరి పట్టణంలో తన ఫ్రెండ్ నివాసంలో శనివారం రాత్రి రాజేందర్ బస చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం విగత జీవిగా కనిపించడం... శరీరంపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : రియల్ జన నాయగన్ - విజయ్ టాప్ ట్రెండింగ్ పొలిటికల్ మూవీస్... ఏ ఓటీటీల్లో చూడొచ్చంటే?
Author : Ganesh Guptha

