Dailyhunt
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

ABP దేశం 1 week ago

బొకారో ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న మహిళకు ఆకస్మాత్తుగా పురిటినొప్పులు రావడం తో ఆమెకు ప్రసవం చేసి తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడారు రైల్వే టికెట్ చెకింగ్ స్టాఫ్.

అన్నవరం -యలమంచిలి మధ్య జరిగిన ఈ ఘటన లో రైల్వే ఉద్యోగులను ప్రశంసిస్తున్నారు నెటిజెన్స్.

అసలేం జరిగిందంటే...!

ఆదివారం నాడు (05.04.2026) అలెప్పీ నుండి ధన్ బాద్ వెళుతున్న ట్రైన్ నెంబర్ 13352 బొకారో ఎక్స్ ప్రెస్ లోని B1 కోచ్ ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్యాసింజర్ కి పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. అన్నవరం స్టేషన్ దాటగానే ఆ గర్భిణి కి నొప్పులు ప్రారంభం కావడం తో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ట్రైన్ లోని టికెట్ చెకింగ్ స్టాఫ్ ని అలెర్ట్ చేశారు. అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న TT (విజయవాడ కు చెందిన TTE) G. జ్యోతి అనే అధికారి వేగంగా స్పందించి రైల్వే కమర్షియల్ మేనేజర్ కు సమాచారం ఇచ్చి గర్భిణీ కి కావాల్సిన వైద్య పరమైన సహాయం అందించే ప్రయత్నం చేశారు.

ట్రైన్ లోనే ప్రసవం.. ఎలమంచిలిలో నిలిపివేసిన ట్రైన్

రైల్వే అధికారులు సమాచారం ఇవ్వడం తో రైలు ఎలమంచిలి స్టేషన్ చేరుకునేసరికి 108 వాహనం కూడా అక్కడకు అందుబాటులోకి వచ్చింది. నిజానికి బోకారో ఎక్స్ ప్రెస్ కి ఎలమంచిలి స్టేషన్లో హాల్ట్ లేదు. అయినప్పటికీ గర్భిణీ కోసం అక్కడ ప్రత్యేకంగా ఆపారు. అయితే ఈ లోపు మహిళకు ప్రసవం జరిగిపోయింది. పరిస్థితిని గమనించిన జ్యోతి స్వయంగా ఆమెకు ప్రసవం చేశారు. ఈలోపు ట్రైన్ ఎలమంచిలి చేరుకోవడంతో ఆ మహిళను రైల్లో పుట్టిన ఆ పాపను 108 అంబులెన్సు ద్వారా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నట్టు రైల్వే శాఖ తెలిపింది.

రైల్వే సిబ్బందికి అభినందనలు

విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించి తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బంది జ్యోతి, బిపుల్ కుమార్, జుబేన్ ఖాన్ లను విజయవాడ DRM మోహిత్ సోనాకియా ప్రత్యేకంగా అభినందించారు.ఆయనతో పాటు విజయవాడ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ " తమ సిబ్బంది తమ అధికారాలు దాటి మరీ ఒక మహిళ ప్రాణాలు కాపాడారని ఇది ఎంతో అభినందించ తగ్గ విషయం" అని అన్నారు.

Author : Vijaya Sarathi

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam