Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congress Political Mind Games: గులాబీ కోటల్లో  హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?

Congress Political Mind Games: గులాబీ కోటల్లో హస్తం ఆపరేషన్ - కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కంచుకోటల్లో క్యాడర్‌పై ఆకర్ష్ ప్రయోగం - వర్కవుట్ అవుతుందా?

ABP దేశం 1 month ago

Telangana Politics Cadre Split: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన, వ్యూహాత్మకమైన అంతర్గత పోరాటం సాగుతోంది. నిన్నటివరకు తిరుగులేని రాజకీయ శక్తులుగా వెలిగిన బీఆర్ఎస్ టాప్ లీడర్ల సొంత నియోజకవర్గాలైన గజ్వేల్ , సిరిసిల్ల , సిద్దిపేట నియోజకవర్గాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ప్రధాన గులాబీ నేతలను నేరుగా ఢీకొట్టడం కంటే, వారి పునాదులను కదిలించేలా ద్వితీయ శ్రేణి లీడర్లను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ వేస్తున్న అడుగులు క్షేత్రస్థాయి రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. కంచుకోటలను బద్దలు కొట్టడానికి హస్తం పార్టీ పక్కా ప్లాన్తో గ్రౌండ్ లెవల్లో మైండ్ గేమ్స్ ఆడుతోంది.

కింది స్థాయి నేతల్ని చేర్చుకుంటున్న కాంగ్రెస్

నిన్నటివరకు గులాబీ సైనికులుగా, పార్టీకి వెన్నుముకగా నిలిచిన స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్లు వ్యూహాత్మకంగా ఆకర్షిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో గ్రామాల్లో పనులు చేసి బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న మాజీ సర్పంచులు, నిధుల కొరతతో సతమతమవుతున్న ప్రజాప్రతినిధులకు అధికార పార్టీ అండగా ఉంటామనే భరోసా ఇస్తోంది. త్వరలో రాబోయే నామినేటెడ్ పదవుల ఎర వేయడం, లేదా స్థానిక నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీలు ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయి క్యాడర్ల విధేయతను మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

గజ్వేల్ - సిద్దిపేటలో సైలెంట్ ఆపరేషన్

ముఖ్యంగా గజ్వేల్ - సిద్దిపేట సరిహద్దు ప్రాంతాల్లో ఈ సైలెంట్ ఆపరేషన్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. పెద్ద నేతలు హైదరాబాద్లోనే ఉంటూ అసెంబ్లీ లేదా మీడియా వేదికలపై పోరాడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లోని కరడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. గజ్వేల్ లాంటి ప్రాంతాల్లో క్యాంప్ ఆఫీసుల చుట్టూ జరుగుతున్న రాజకీయ ఘర్షణలు, నిరసనలు కేవలం పైకి కనిపించే ఊహాగానాలు కావు, లోపల మాత్రం సింపుల్గా పని చేసుకు వెళ్తున్నాయి. ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో కాంగ్రెస్ రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తోంది. ఒకటి—అధికార బలాన్ని చూపించి స్థానిక పనులకు బ్రేకులు వేయడం లేదా సహకరించడం. రెండు—బీఆర్ఎస్ అధిష్టానానికి, స్థానిక లీడర్లకు మధ్య నమ్మకరాహిత్యాన్ని సృష్టించడం. మీరు పార్టీలోనే ఉన్నా మీకు వచ్చే లాభం లేదు, అధికార పార్టీలోకి వస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అనే ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి, క్యాడర్లోకి తీసుకెళ్తున్నారు. దీనివల్ల నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తున్నా, లోపలి గ్రామాల్లో మాత్రం గులాబీ కోటల పునాదులు నెమ్మదిగా బలహీనపడుతున్నాయి.

తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న హరీష్

ఈ ఆపరేషన్ కాంగ్రెస్కు పూర్తిగా ఏకపక్షంగా సాగడం లేదు. సిద్దిపేట, గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో హరీష్ రావు లాంటి నేతలు అలకపాన్పు ఎక్కిన కార్యకర్తలను బుజ్జగించేందుకు, తిరిగి పార్టీలోకి వలసలను ప్రోత్సహించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలను, స్థానిక ఎన్నికల జాప్యాన్ని ఎండగడుతూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అయినప్పటికీ, అధికార పార్టీ విసిరిన వలయం వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కొంత అయోమయం నెలకొంది. కంచుకోటలుగా భావించే ఈ మూడు నియోజకవర్గాల్లో క్యాడర్ చెల్లాచెదురైతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. గులాబీ నేతలకు హస్తం పార్టీ వేస్తున్న ఈ గాలం కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను వారి సొంత నియోజకవర్గాల రక్షణలోనే బిజీగా ఉంచి, రాష్ట్రస్థాయిలో వారి దూకుడును తగ్గించాలనేది కాంగ్రెస్ మార్క్ హైలెవల్ పొలిటికల్ స్ట్రాటజీ. ఈ మైండ్ గేమ్లో కాంగ్రెస్ ఎంతవరకు సఫలమవుతుంది, గులాబీ త్రయం తమ కంచుకోటలను ఎలా కాపాడుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam