Dailyhunt
Dengue Cases : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Dengue Cases : పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులు.. పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

ABP దేశం 1 week ago

Dengue and Malaria Cases Rising in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో దోమల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి.

ఎండలు, వర్షాలు, నిల్వ నీరు, పరిశుభ్రత లోపం వల్ల దోమల వ్యాప్తి మరింత పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులతో పాటు.. డెంగ్యూ, మలేరియా కూడా ఇబ్బంది పెడుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదని.. కాబట్టి ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

డెంగ్యూ, మలేరియా

డెంగ్యూ అనేది వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి. ఇది ప్రధానంగా Aedes దోమల ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది Anopheles దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ రెండు కాస్త భిన్న లక్షణాలు కలిగి ఉంటాయి.

డెంగ్యూ లక్షణాలు

డెంగ్యూ సోకితే అధిక జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. దీనివల్ల కంటి వెనక కూడా నొప్పి వస్తుంది. కీళ్ల, కండరాల నొప్పులు.. చర్మంపై ఎర్రటి మచ్చలు వస్తాయి.

మలేరియా లక్షణాలు

మలేరియా వల్ల చలి జ్వరం వస్తుంది. చెమటలు ఎక్కువగా పడటంతో పాటు.. వాంతులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆలస్యం చేస్తే ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ప్రాణాపాయం కూడా కావచ్చు. ఒకవేళ డెంగ్యూ, మలేరియా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంటి చుట్టూ మొక్కలు, కుండీలు, టైర్లు, ట్యాంకులు వంటి చోట్ల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణ కోసం నెట్స్ వాడాలి. చేతులు, కాళ్లు కప్పుకునేలా దుస్తులు వేసుకుంటే మంచిది. క్రీములు, లిక్విడ్స్, కాయిల్స్ వంటివి ఉపయోగించండి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే నీటిని కూడా మరిగించి తీసుకుంటే మంచిది.

జ్వరం లక్షణాలు ఉంటే సొంతంగా మెడిసన్ తీసుకోకుండా.. వైద్య సహాయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు కాస్త రిలీఫ్ అనిపించినా నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల సమస్య తీవ్రత పెరిగిపోతుంది. డెంగ్యూ, మలేరియా వంటి వాటిని ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam