Election Results 2026: దేశ రాజకీయాల్లో చరిత్రలో గత రెండేళ్లు అత్యంత కీలకమైన మార్పులకు సాక్ష్యంగా నిలిచాయి. తమ రాష్ట్రాల్లో ఎదురులేని నాయకులుగా వెలుగొందిన అగ్రనేతలు నేడు తమ సొంత గడ్డపై ఓటమి పాలయ్యారు.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఢిల్లీ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
2026లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ ఆమె తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో పరాజయం పాలయ్యారు. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె 15వేల ఓట్లకుపైగా తేడాతో ఓటమి చెందారు. ఈ ఓటమిని మమతాబెనర్జీ జీర్ణించుకోలేకపోయారు. ఇది ప్రజాతీర్పు కాదని, కేవలం లూటీ మాత్రమేనని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
గత చరిత్రను పరిశీలిస్తే 2021 ఎన్నికల్లో కూడా ఆమె నందిగ్రామ్ నియోజకవర్గంలో ఇదే సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయితే అప్పట్లో ఆమె పార్టీ ఘన విజయం సాధించడంతో ఆమె ముఖ్యమంత్రిగా కొసాగారు. కానీ 2026లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక, బీజేపీ రాజకీయ వ్యూహాల ఒత్తిడి ఆమె పతనానికి దారి తీశాయి.
స్టాలిన్ కంచుకోట కూలింది
దక్షిణ భారత రాజకీయాల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన ఎంకే స్టాలిన్కు కూడా 2026 చేదు అనుభవాన్ని మిగిల్చింది. మే 2026లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ తన నియోజకవర్గం కొలత్తూరులో ఊహించని విధంగా ఓడిపోయారు. వరుసగా మూడుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు ఈసారి ఓటరు మొహం చాటేశారు.
టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన 8, 795 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ ఓటమి స్లాలిన్ను, డీఎంకే శ్రేణులను తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టింది. ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది ఆ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ గాలికి నిదర్శనంగా చెబుతున్నారు.
కేజ్రీవాల్కు తప్పని పరాభవం
గతంలో కూడా ఇలాంటి ఉద్దండులు ఓడిపోయిన చరిత్ర ఉంది. రాజకీయాల్లో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ ఓటర్లు 2025లో షాక్ ఇచ్చారు. ఫిబ్రవి 2025లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూడిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఆయన సుమారు మూడు వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
అధికారంలో ఉన్న వారు ఓడిపోవడం అనే ప్రక్రియ 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఊపందుకుంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీని వల్ల అప్పటి ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్(రాజస్థాన్), భూపేష్ బఘేల్(చత్తీస్గఢ్) తమ కుర్చీలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్ వంటి నాయకులు తమ సొంత నియోజకవర్గాల్లో ఓడిపోవడం అనేది కేవలం వ్యక్తిగత ఓటమి కాదు. అది ఆయా పార్టీల పతనాన్ని లేదా ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని సూచించే కీలక సంకేతం. భారత రాజకీయాల్లో ఇప్పుడు కొత్త నాయకత్వానికి, మార్పుకు సమయ ఆసన్నమైందని ఫలితాలు నిరూపిస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ నాయకులు తిరిగి పంజుకుంటారా లేదా కొత్త శక్తులు మరింత బలోపేతం అవుతాయా అనేది వేచి చూడాలి.
Author : Khagesh

