Dailyhunt
EPFO Rules: కనీస పెన్షన్ భారీగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం! కోట్లాది మందిలో చిగురించిన ఆశలు

EPFO Rules: కనీస పెన్షన్ భారీగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం! కోట్లాది మందిలో చిగురించిన ఆశలు

ABP దేశం 1 week ago

EPFO EPS Scheme: రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి నెలవారీ పెన్షన్ అనేది వారికి ఏకైక జీవనాధారం. నేటి కాలంలో కేవలం రూ. 1000 పెన్షన్ లభిస్తే, దాంతో ఏం చేసుకుంటారు ?

పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు కాస్త ఉపశమనం కలిగించే దిశగా ఆలోచిస్తోంది. ప్రభుత్వం రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ను పెంచాలని భావిస్తోంది. అయితే ఎంతమేర పెంచుతారు అనేదానిపై క్లారిటీ లేదు.

పెన్షన్ ఎంత పెరుగుతుంది?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగుల కనీస పెన్షన్ను రూ. 7,500కి పెంచడంపై పరిశీలిస్తోంది. ఈ డిమాండ్ను కార్మిక సంఘాలు చాలా కాలంగా అడుగుతున్నాయి. ప్రస్తుత పెన్షన్ మొత్తం ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సరిపోవడం లేదని చెబుతున్నారు. పెరుగుతున్న ఖర్చులకు వచ్చే పెన్షన్ మొత్తానికి సంబంధం ఉండటం లేదన్నది వారివాదన. పెన్షన్ పెంపు ప్రతిపాదనకు ఒక పార్లమెంటరీ కమిటీ మద్దతు కూడా లభించింది. పెన్షన్ పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని, ఏ నిర్ణయం తీసుకున్నా అది పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

EPS-95 కింద పెన్షన్ పొందే వారికి ప్రయోజనం
ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఈ నిర్ణయంతో అత్యధిక ప్రయోజనం EPS-95 కింద పెన్షన్ పొందే వారికి కలుగుతుంది. వీరిలో చాలా మంది తక్కువ ఆదాయం వచ్చేవారు ఉన్నారు. వారి కోసం పెన్షన్లో వచ్చే స్వల్ప పెరుగుదల అయినా రోజువారీ ఖర్చులు, వైద్య చికిత్స, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని జీవించడంలో ఎంతో సహాయపడుతుంది.

EPFO నుంచి డబ్బు విత్డ్రా సులభతరం
పెన్షన్ పెంచడంతో పాటు EPFO నుండి డబ్బు విత్డ్రా చేసుకునే ప్రక్రియను కూడా సులభం చేసేందుకు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఏటీఎం (ATM)ల ద్వారా ఖాతాదారులు తమ PF డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం ప్రారంభించనున్నారు. దీనివల్ల ప్రజలకు ఈపీఎఫ్ డబ్బు త్వరగా, సకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుతుంది. ఇది కాకుండా PF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీని ఇచ్చే ప్రతిపాదనపై కార్మిక శాఖ చర్చించింది. అయితే దీనికి ఇంకా ఆమోదం లభించాల్సి ఉంది.

ఈపీఎఫ్ఓ (EPFO) తన పనితీరును నిరంతరం మెరుగు చేసుకుంటోంది. కొన్ని నెలలపాటు పట్టే చాలా ప్రక్రియలను ఖాతాదారులకు సులభతరం చేసింది. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్, ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతమైంది. అయితే ప్రస్తుతం పెన్షనర్లతో పాటు ఉద్యోగుల దృష్టి కేవలం కనీస పెన్షన్ పెంపు నిర్ణయం పైనే ఉంది. కేంద్రం తమకు ఊరట కలిగిస్తుందని, ఖర్చుల బాధ భరించలేకపోతున్న పెన్షనర్లు ప్రభుత్వ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Author : Shankar Dukanam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam