Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే

Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే

ABP దేశం 1 week ago

Nitin Gadkari Launches Ethanol-Based Cooking Stove : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. LPG కంటే చౌకగా మరో కొత్త ఆవిష్కరణను పరిచయం చేశారు.

LPG గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఇథనాల్ బేస్డ్ కుకింగ్ స్టవ్ను నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ స్టవ్లో కేవలం 7 శాతం ఇథనాల్, నీటి మిశ్రమం ఉంటుందని.. దీనితో హ్యాపీగా వంట చేసుకోవచ్చని తెలిపారు. అలాగే గ్యాస్ సిలిండర్తో పోలిస్తే ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని అన్నారు.

ఇథనాల్ స్టవ్ ప్రత్యేకత ఏమిటి?

ఇథనాల్ స్టవ్లో సుమారు 7 శాతం ఇథనాల్, మిగిలిన భాగం నీటితో కూడిన మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ఈ మిశ్రమంతో ఉత్పత్తి అయ్యే మంట ఇంటి అవసరాలకు సరిపోయే విధంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా LPGతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండనుంది.

రైతులకు కూడా లాభమా?

ఈ కొత్త స్టౌవ్​తో రైతులకు కూడా లాభం చేకూరుతుందట. ఎందుకంటే.. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు వంటి పంటలు ప్రధాన ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. దీంతో ఇథనాల్ వినియోగం పెరిగితే రైతులకు కూడా కొత్త మార్కెట్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించడం వల్ల విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.

కాలుష్య సమస్యలు?

ఇథనాల్ ఇంధనం LPGతో పోలిస్తే మరింత శుభ్రంగా మండుతుందని నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల హానికర వాయువుల విడుదల తక్కువగా ఉంటుందని.. పొగ, మసి కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇంట్లో వంట సమయంలో ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

అయితే ఈ స్టవ్పై కొందరు శాస్త్రవేత్తలు, ఇంధన నిపుణులు కొన్ని అంశాలు తెరపైకి తెచ్చారు. కేవలం 7 శాతం ఇథనాల్ మిశ్రమంతో ఇంటి అవసరాలకు సరిపడే స్థాయిలో వేడి ఉత్పత్తి చేయడం ఎలా సాధ్యమవుతుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈ స్టవ్ పనితీరు, సామర్థ్యం, భద్రత, ఉద్గారాలపై ఎలాంటి సాంకేతిక వివరాలు బయటకు రాలేదు.

LPGకి ప్రత్యామ్నాయమా?

భారత్లో ఇప్పటికే LPG పంపిణీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించింది. కోట్లాది కుటుంబాలు గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇథనాల్ స్టవ్ పెద్ద ఎత్తున ప్రజాదరణ పొందాలంటే ఎథనాల్ సరఫరా వ్యవస్థ, ధరలు, భద్రత, వినియోగదారుల నమ్మకం వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి.

ఇథనాల్ వినియోగం..

గత కొన్నేళ్లుగా భారత్లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. 2014లో 1.5 శాతం స్థాయిలో ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ ప్రస్తుతం 20 శాతానికి చేరుకుంది. ఇప్పుడు వాహనాల నుంచి వంటింటి వరకు ఇథనాల్ వినియోగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడు?

ప్రస్తుతం ఈ స్టవ్ను ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తారనే విషయంపై క్లారిటీ ఇంకా లేదు. ధర, సబ్సిడీ, పంపిణీ విధానం వంటి వివరాలను కూడా ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. మరి ఈ కొత్త టెక్నాలజీ భారత వంటింట్లో విప్లవం సృష్టిస్తుందా? లేక పరిమిత స్థాయిలోనే మిగిలిపోతుందా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Author : Geddam Vijaya Madhuri

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam