Raksha Bandhan Free Recharge News: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూసి, రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ రీఛార్జ్ అందిస్తుందని నమ్మిస్తున్నారు.
దీన్ని మీరు నమ్మితే మీ అకౌంట్లో ఉన్న నగదు మాయం కావచ్చు. లేదా మీ డేటా వేరే వారి చేతికి వెళ్లిపోవచ్చు. లేకుంటే మీ ఫొటోలు వేరే సైట్స్లో ప్రత్యక్షం కావచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్తో సహా వివిధ ప్లాట్ఫామ్లలో షేర్ అవుతోంది. ఈ వీడియో ఒక ప్రభుత్వ పథకానికి సంబంధించినదని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో వెనుక ఉన్న నిజం వేరేదని మీకు తెలుసా? కాబట్టి, మీకు అలాంటి వీడియో లేదా మెసేజ్లు వస్తే, దాన్ని సరిచూసుకోకుండా షేర్ చేయవద్దు.
వైరల్ వీడియోలో ఏం ఉంది?
రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూపిస్తోంది. ఈ పథకం ప్రకారం, దేశంలోని మహిళలు ఏడాది పొడవునా మొబైల్ ఫోన్ రీఛార్జ్ల కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆ వీడియో పేర్కొంటోంది.
నిజానికి, వైరల్ అవుతున్న ఆ పోస్ట్, వీడియోను చూసిన మొదటి చూపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన నిజమైన ప్రకటనలా అనిపిస్తుంది. అలా ఆ వీడియోను డిజైన్ చేశారు. అందుకే ప్రజలు అది నిజమైనదని నమ్మి, దాన్ని వేగంగా షేర్ చేస్తున్నారు.
ప్రభుత్వం నిజంగానే ఒక సంవత్సరం ఉచిత రీఛార్జ్ ఇస్తోందా?
పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ వైరల్ వీడియోపై రీసెర్చ్ చేసింది. ఇది పూర్తిగా నకిలీదని తెలిపింది. వాస్తవానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక పాత వీడియోను డిజిటల్గా ఎడిట్ చేసి, దానికి ఈ తప్పుడు సమాచారాన్ని జోడించారు.
పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు ఏడాది పాటు ఉచిత మొబైల్ రీఛార్జ్ అందిస్తామని ప్రభుత్వాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. అంటే, ఈ వైరల్ పోస్ట్లో చేసిన వాదన పూర్తిగా అబద్ధం. ఇలాంటివి షేర్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Author : Khagesh

