Harish Rao Clean Image Politics: తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా తనే ముందుండి ప్రత్యర్థులపై వ్యతిరేక దాడి చేయడమే తప్ప, ఎప్పుడూ రక్షణాత్మక ధోరణిలో రాజకీయాలు చేసే అలవాటు లేని బలమైన నాయకుడు తన్నీరు హరీష్ రావు.
దీనికి ప్రధాన కారణం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయనపై పెద్దగా అవినీతి మరకలు లేకపోవడమే. గతంలో ఆయనపై వచ్చిన విమర్శలన్నీ కేవలం రాజకీయ కోణంలో చేసినవే తప్ప, పక్కా ఆధారాలతో ఆయన్ను ఇరకాటంలో పెట్టే స్థాయి ఆరోపణలు ఇప్పటి వరకు రాలేదు. కానీ, ప్రస్తుతం హరీష్ రావు తన రాజకీయ జీవితంలోనే మొదటిసారిగా సమాధానం చెప్పుకోవాల్సిన సంకట స్థితిలో పడ్డారు.
ఏపీ వ్యాపారుల కాలేజీలు,ఆస్పత్రులకు పాలు సరఫరా
ఈ వివాదానికి కేంద్ర బిందువు హరీష్ రావు సతీమణి యాజమాన్యంలోని మిల్చీ మిల్క్ డైరీ బ్రాండ్. ఈ కంపెనీ మార్కెట్లో సాధారణ ప్రజలకు పంపిణీ చేసే వాటా చాలా పరిమితంగా ఉన్నప్పటికీ.. హైదరాబాద్లోని బడా కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రముఖ విద్యాసంస్థలు , కాలేజీలకే అత్యధికంగా పాలను సరఫరా చేస్తుందనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార బలాన్ని ఉపయోగించి, సదరు ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్పొరేట్ విద్యాసంస్థలను, ఆసుపత్రులను బెదిరించి బలవంతంగా ఈ బ్రాండ్ పాలను కొనుగోలు చేయించారనే తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంపై కల్వకుంట్ల కవితతో పాటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా నేరుగా ఇవే ఆరోపణలు గుప్పించడంతో ఈ అంశానికి రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. హరీష్ రావు కుటుంబ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఆరోపణలు ఇలా సాగుతుండగానే, ఊహించని విధంగా మిల్చీ మిల్క్ అధికారిక వెబ్సైట్ హఠాత్తుగా ఇంటర్నెట్ నుండి డౌన్ కావడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.
క్లైంట్స్ గురించి తెలియకుండా ఉండటానికేనా?
వెబ్సైట్ డౌన్ చేయడానికి అఫీషియల్ క్లైంట్స్ పేజీలో ఉన్న బడా విద్యాసంస్థల లోగోలు, పేర్లను కొందరు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేయడమేనని తెలుస్తోంది. ఈ స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ కావడంతో, హరీష్ రావు క్యాంప్లో కొంత కంగారు మొదలైందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిజంగానే అక్రమాలు జరగకపోతే వెబ్సైట్ను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలను ప్రత్యర్థులు బలంగా సంధిస్తున్నారు. అయితే, తన రాజకీయ జీవితంలో ఎంతటి పెద్ద సంక్షోభాలనైనా సమర్థవంతంగా ఎదుర్కొన్న హరీష్ రావు.. ఇంతవరకు ఈ మిల్చీ మిల్క్ వివాదంపై నేరుగా ఎక్కడా స్పందించలేదు. సాధారణంగా తనపై చిన్న విమర్శ వచ్చినా గణాంకాలతో సహా తిప్పికొట్టే హరీష్, ఈ ఫ్యామిలీ బిజినెస్ వివాదంలో వ్యూహాత్మక మౌనం వహించడం వెనుక ఉన్న కారణాలపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ప్రస్తుత తరుణంలో ఆయన ఈ అంశంపై గట్టిగా, పక్కా ఆధారాలతో స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది.
రాబోయే రోజుల్లో హరీష్ రావు కనుక ఈ ఆరోపణలను బలంగా తిప్పికొట్టి తన వాదనను ప్రజల ముందు ఉంచగలిగితే ఈ వివాదానికి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ మౌనాన్ని ఇలాగే కొనసాగిస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఒక బలమైన పొలిటికల్ అస్త్రంగా మలచుకుని, ఎల్లప్పుడూ క్లీన్ ఇమేజ్తో ఉండే హరీష్ రావును రాజకీయంగా కార్నర్ చేస్తూనే ఉండే ప్రమాదం ఉంది. ఏదేమైనా, ఎప్పుడూ డిఫెన్స్లో పడనని చెప్పుకునే హరీష్ రావుకు ఈ డైరీ వివాదం ఒక పెద్ద పరీక్షగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదని భావిస్తున్నారు.
Author : Raja Sekhar Allu

