Most Powerful Goddess in Hinduism: హిందూ పురాణాల్లో ఉగ్రరూప దేవతలు లేదా అత్యంత భయంకరమైన దేవతలు గురించి తెలుసుకుందాం.. వీరంతా భయంకర రూపాలు ధరించి, దుష్ట శక్తులను, అధర్మాన్ని నాశనం చేస్తారు.
వారి రూపాలు భయపెట్టేవే అయినా భక్తులను రక్షించడం, ధర్మ స్థాపన కోసం ఆ రూపాలు ధరించారు. వివిధ పురాణాలు, దేవీ మహత్యం వంటి గ్రంథాల్లో ఉన్న సమాచారం ఆధారంగా ఓ పది మంది ఉగ్రరూప దేవతల గురించి తెలుసుకుందాం..
కాళీ
హిందూ పురాణాల్లో అత్యంత భయంకరమైన దేవత కాళీ. నల్లని రంగు, పుర్రెల హారం, కాల స్వరూపం, ఇల్యూజన్ ను నాశనం చేసి పునరుద్ధరణకు దారి చూపుతుంది. భక్తులకు తల్లిలా రక్షణ ఇస్తుంది కాళీ..
కాల భైరవ
పరమేశ్వరుడి ఉగ్రరూపం కాలభైరవుడు. కాలానికి అధిపతి శివయ్య. కుక్క వాహనం, చేతిలో కపాలం, ఖడ్గం, బ్రహ్మ ఐదో తలను నరికేసి అహంకారాన్ని నాశనం చేసిన రూపం ఇది. అడ్డంకులు తొలగించి , కర్మ బంధాలనుంచి విముక్తి కలిగించే రూపం. కాలభైరవుడు భయంకరంగా కనిపిస్తాడు కానీ భక్తులకు రక్షకుడు
నారసింహుడు
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నాల్గవ అవతారం నారసింహుడు. ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి హిరణ్యకశిపుడిని సంహరించేందుకు ఈ రూపాన్ని ధరించాడు విష్ణువు. ఉదయం రాత్రి కాని సంధ్యాసమయంలో ఆయుధాలు ఉపయోగించకుండా గోళ్లతో రాక్షస సంహారం చేశాడు. భయంకర గర్జన, రక్తం కారుతున్న నాలుక, ఆ రూపం చూసి దేవతలే వణికిపోయారు.. ప్రహ్లాదుడు శాంతింపచేశాడు. ఈ రూపం ధర్మ రక్షణకు ఉదారహణ.
రుద్రుడు
శివుడి ఉగ్రరూపమే రుద్రుడు. ధ్యానంలో ఉండే శివయ్య మూడో కన్ను తెరిస్తే కనిపించే ఉగ్రరూపం ఇది. మూడో కన్ను తెరిచి కామదేవుడిని బూడిద చేశాడు. అజ్ఞానం, కామాన్ని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించే దేవుడు. ఈ రూపం విధ్వంసం అంటారు కానీ పునర్నిర్మాణం కూడా అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
ఛిన్న మస్త
దశ మహావిద్యలలో ఓ రూపం ఛిన్న మస్త. అమ్మవారు స్వయంగా తన తలను తాను కత్తిరించుకుని ఓ చేత్తో పట్టుకోవడమే కాదు .. రక్తం తాగుతూ భయంకరంగా కనిపిస్తుంది. స్వయం త్యాగం, శక్తి ప్రవహాం, కామం నియంత్రణను సూచిస్తుంది. ఈ రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది కానీ భక్తులకు అంతే శక్తిని అందిస్తుంది
ధూమావతి
ఛిన్న మస్త లానే ధూమావతి కూడా దశ మహావిద్యల్లో ఒకరు. ఈమెది వితంతు రూపం..పొగతో నిండిన రూపం ఇది. యుద్దాలు, కరవు, విధ్వంసాన్ని సూచిస్తుంది కానీ జ్ఞానం, వైరాగ్యాన్ని ఇస్తుంది
చాముండేశ్వరి
దేవీ మహత్యంలో మహిషాసురుడిని చంపిన ఉగ్రరూపం చాముండేశ్వరి. భయంకరమైన ముఖం, పుర్రెల హారంతో శత్రు సంహారం చేస్తూ దర్శనమిస్తుంది చాముండేశ్వరి. దుర్గాదేవి భయంకరమైన అంశం.. శత్రుసంహారం చేసి భక్తులకు అండగా నిలిచే రూపం ఇది
యమ ధర్మరాజు
యమధర్మరాజు...ఈ పేరు వింటేనే భయపడతారు. ఎర్రటి కళ్లు, పదునైన పళ్లు, పాశంతో ఆత్మలను లాగే ఈయన వాహనం ఎద్దు. కర్మల ఆధారంగా తీర్పులు ఇస్తూ న్యాయం, సమతుల్యతను సూచిస్తాడు. రూపం భయాన్ని కలిగిస్తుంది కానీ ధర్మాన్ని ఆచరించడంలో ఈయన తర్వాతే ఎవరైనా..
దుర్గా దేవి
శక్తి స్వరూపిణి , చేతుల నిండా ఆయుధాలు ధరించి సింహంపై దర్శనమిచ్చి మహిషాసురిడిని సంహరించే రూపం ఇది. దుష్ట శక్తులపై విజయాన్ని సాధించే భయంకర రూపం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో పూజలందిస్తారు. నిత్యం దుర్గాదేవిని స్మరించేవారికి కష్టాలు ఉండవని భక్తుల విశ్వాసం
వరాహ రూపం
శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఇదొకటి. పంది రూపం.. హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించిన రూపం ఇది. భారీ శరీరం, పదునైన దంతాలతో బలం, ధైర్యాన్ని సూచించే రూపం ఇది. ఈ రూపం దేవతలకు కూడా భయంకరంగా కనిపించినా..భక్తులకు మేలు చేయడమే దానివెనుకున్న ఉద్దేశం
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Author : RAMA

