హైదరాబాద్: నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
స్థానిక తాడ్బన్ ప్రాంతంలోని జూపార్క్ సమీపంలో ఉన్న ఒక టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న స్క్రాప్ దుకాణానికి కూడా వ్యాపించడంతో ప్రమాదం తీవ్రరూపం దాల్చింది.
మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదంతో సంభవించిన ఆస్తి నష్టంపై అధికారులు స్పందించాల్సి ఉంది.
ఇటీవల కిషన్బాగ్లో భారీ అగ్నిప్రమాదం..
రెండు రోజుల కిందట నగరంలోని బహదూర్పురా నియోజకవర్గ పరిధిలోని కిషన్బాగ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి ఒక సోఫా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు పరిశ్రమ అంతటా విస్తరించడంతో, ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.
మంటల తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సదరు సోఫా తయారీ కేంద్రం చుట్టుపక్కల జనావాసాలు ఉండటంతో, మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. సమయానికి అగ్నిమాపక యంత్రాలు అందుబాటులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సమ్మర్ సీజన్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నారు.
స్లింగ్ షాట్తో షాపుల గాజులు ధ్వంసం చేసిన నిందితులు అరెస్ట్
వరుసగా షాపుల గాజులను ధ్వంసం చేస్తూ ప్రజలకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడిన నలుగురు నిందితులను ఐఎస్ సదన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితులు గులెల్ (Slingshot), గోటి సహాయంతో వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో షాపుల గాజులను పగులగొట్టి వినోదం పొందుతూ ఈ నేరాలకు పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలు సంతోష్నగర్, సైదాబాద్, చాదర్ఘాట్, మలక్పేట్, చంద్రాయణగుట్ట, సరూర్ నగర్, ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోటుచేసుకున్నాయి. మొత్తం 11 కేసులు ఛేదించినట్లు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుండి ఒక క్వాలిస్ వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, గులెల్ (స్లింగ్ షాట్), గాజు బంతులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, ఏసీపీ సంతోష్నగర్ డివిజన్ టి. సుఖ్దేవ్ సింగ్, ఇన్స్పెక్టర్ జి. నాగరాజు పర్యవేక్షణలో ఎస్ఐ కె. మహేష్ దర్యాప్తులో ఐఎస్ సదన్ పోలీస్ బృందం విజయవంతంగా ఛేదించింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని పోలీసులు హెచ్చరించారు.
Author : Shankar Dukanam

