Raidurg Knowledge City land auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం ఐటీ కారిడార్కే పరిమితం కాకుండా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మారుతున్న భాగ్యనగరం తన రికార్డులను తానే తిరగరాస్తోంది.
తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిసరాల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన ఈ-వేలంలో భూముల ధరలు కళ్ళు చెదిరే రీతిలో పలికాయి. సర్వే నంబర్ 83/1లోని పాన్ మక్తా ప్రాంతంలో 6 ఎకరాల 29 గుంటల భూమికి నిర్వహించిన వేలంలో, ఒక ఎకరం ఏకంగా రూ.237 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. గతేడాది అక్టోబర్లో ఇదే ప్రాంతంలో ఎకరం రూ.177 కోట్లు పలకగా, కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఆ ధరను మించిపోయి రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
రికార్డులు బద్దలు.. అంతర్జాతీయ స్థాయిలో చర్చ
రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో ఉన్న ఈ భూమి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఐటీ కంపెనీలు, హై-రైజ్ టవర్లు, మెట్రో కనెక్టివిటీ ఉండటంతో దేశీయ , అంతర్జాతీయ డెవలపర్లు ఈ వేలంలో పోటాపోటీగా పాల్గొన్నారు. టీజీఐఐసీ నిర్ణయించిన కనీస ధర రూ.139 కోట్లు కాగా, వేలం ముగిసే సమయానికి అది దాదాపు రూ.237 కోట్లకు చేరుకుంది. ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలతో పోల్చినా, హైదరాబాద్లోని ఈ ధర ఇప్పుడు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోనే టాప్ రేంజ్లో ఉంది.
ఎందుకింత క్రేజ్?
రాయదుర్గం ప్రాంతానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక్కడి భూమి బంగారం కంటే ఎక్కువ విలువైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వేలం వేసిన 6 ఎకరాల స్థలం హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు ఓఆర్ఆర్ కు అత్యంత సమీపంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. గతంలో కోకాపేట నియోపోలిస్ లో ఎకరం రూ.100 కోట్లు దాటినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, ఇప్పుడు రాయదుర్గం ఆ రికార్డును ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఈ ఒక్క వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అగ్రరాజ్యం అమెరికాతో పోటీ పడుతోందంటూ చర్చించుకుంటున్నారు. ఏదేమైనా, ఈ రికార్డు ధర హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరోస్థాయికి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు.
Author : Raja Sekhar Allu

