IPL 2026 MI VS LSG Live Updates: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. 19 ఏళ్ల తమ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ ను నమోదు చేసింది. సోమవారం సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. మిడలార్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (21 బంతుల్లో 63, 1 ఫోర్, 8 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో కార్బిన్ బోష్ కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ ను 18.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్బ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 84, 6 ఫోర్లు, 7 సిక్సర్లు)తో సిక్సర్ల సునామీ సృష్టించాడు. బౌలర్లలో సిద్ధార్థ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో హ్యాటిక్ ఓటముల తరవాత ముంబై విజయం సాధించినట్లు అయింది. మరోవైపు లక్నోకు ఇది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. ఇక మంగళవారం జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
తుఫాన్ బ్యాటింగ్..
భారీ టార్గెట్ తో బరిలోకి ముంబైకి ఓపెనర్లు రోహిత్, ర్యాన్ రికెల్టన్ (32 బంతుల్లో 83, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా వింటేజ్ రోహిత్ ను గుర్తు చేస్తూ రోహిత్ సిక్సర్లను బాదాడు. మరోవైపు రికెల్టన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వేగంగా పరుగులు సాధిస్తూ, స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దీంతో పవర్ ప్లేలో 71 పరుగులను సాధించింది. ఎంతమంది బౌలర్లను మార్చిన ఓపెనర్ల జంటను విడదీయడంలో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ విఫలమయ్యాడు. ఈక్రమంలో ముందుగా రికెల్టన్ 22 బంతుల్లో ఫిఫ్టీ, ఆ తర్వాత రోహిత్ 27 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 65 బంతుల్లోనే 143 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నమోదయ్యాక రికెల్టన్ ఔట్ అయ్యాడు.

