Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

ABP దేశం 1 week ago

Jagtial Mobile driving death: జగిత్యాల జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉత్సాహం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వాహనం నడుపుతూ మొబైల్ స్క్రీన్పై మ్యాచ్ చూస్తూ చేసిన చిన్న పొరపాటు..

ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

కళ్ల ముందే ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది.. ఆ ఉత్కంఠను తట్టుకోలేక, వాహనం నడుపుతున్నామనే స్పృహ కూడా మరచి మొబైల్ స్క్రీన్ వైపు చూశాడు ఆ యువకుడు. అంతే, క్షణాల వ్యవధిలో నియంత్రణ కోల్పోయిన మహీంద్రా థార్ వాహనం రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి శివారులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అరుణ్ అనే 24 ఏళ్ల యువకుడు బావిలో మునిగి ప్రాణాలు కోల్పోగా, అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

అసలు ఏం జరిగిందంటే?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయినా అత్యవసర పని మీద అరుణ్ తన స్నేహితులతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. తన స్నేహితులు నివేష్, అశ్విన్లతో కలిసి థార్ వాహనంలో డ్రైవింగ్ సీట్లో కూర్చోగా, పక్కనే ఉన్న ఫోన్లో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. మోరపెల్లి గ్రామ సమీపంలోకి రాగానే, మ్యాచ్లో ఒక కీలకమైన ఓవర్ పడటంతో అరుణ్ దృష్టి రోడ్డుపై నుంచి పూర్తిగా మొబైల్ స్క్రీన్పైకి మళ్లింది. వేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కన రక్షణ గోడ లేని లోతైన బావి వైపు దూసుకెళ్లి, అందులో పడిపోయింది.

స్థానికుల సాహసం.. ఇద్దరు సురక్షితం

వాహనం బావిలో పడటాన్ని గమనించిన మోరపెల్లి గ్రామస్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. బావిలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వాహనం లోపల చిక్కుకున్న నివేష్, అశ్విన్లను స్థానికులు అత్యంత సాహసోపేతంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే, డ్రైవింగ్ సీట్లో ఉన్న అరుణ్ సీట్ బెల్ట్ లాక్ అయిపోవడంతో పాటు, వాహనం ముందు భాగం నీటిలో మునిగిపోవడంతో అతను బయటకు రాలేకపోయాడు.

రెండు గంటల పాటు సహాయక చర్యలు

సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు, అగ్నిమాపక , రెస్క్యూ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ క్రేన్ సహాయంతో బావిలో మునిగిపోయిన థార్ వాహనాన్ని పైకి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన సహాయక చర్యల అనంతరం అరుణ్ మృతదేహాన్ని వాహనం నుంచి వెలికితీశారు. అప్పటికే అతను ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ చూడటం ప్రాణాంతకం అని పోలీసులు ఎంత నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా యువతలో మార్పు రావడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam