Mumbai Indians Plan Major Leadership Transition: ఐపీఎల్ ట్రేడింగ్ రూమర్ల నడుమ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో ఏడాది పాటు ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంచైజీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కెప్టెన్సీ పదవి నుంచి అతడిని తప్పించినప్పటికీ, సరైన ట్రేడ్ డీల్ కుదరకపోవడంతో ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై జట్టులోనే అతడు కొనసాగేందుకు మార్గం సుగమమైంది. అయితే కెప్టెన్సీలో మాత్రం భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని సమాచారం. కొత్త సారథిని ఎంపిక చేసే కీలక చర్చల్లో ఐదుసార్లు ట్రోఫీ గెలిపించిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు.
నయా కెప్టెన్ అతడే..!
ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసం సరికొత్త నాయకత్వంలో ముందుకు వెళ్లాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేకపోవడంతో, కొత్త నాయకుడి ఎంపికపై తన అమూల్యమైన సలహాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో తెలుగు స్టార్ తిలక్ వర్మ, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో తిలక్ వర్మ వైపే ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతోందని సమాచారం.
చర్చలు జరిగినా, నో డీల్..
హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) - ముంబై ఇండియన్స్ మధ్య సంప్రదింపులు జరిగాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ట్రేడ్ అసెట్ గా కేకేఆర్ ముందుకు తెచ్చినప్పటికీ, వచ్చే ఏడాది అతడి వర్క్‌లోడ్ సమస్యల కారణంగా ముంబై ఆసక్తి చూపలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ కొత్త హెడ్ కోచ్‌ను ఖరారు చేసిన తర్వాత వారితో చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే ట్రేడింగ్ జరగకపోతే హార్దిక్ ముంబైలోనే సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతాడని ఫ్రాంచైజీ వర్గాలు వెల్లడించాయి.
స్కై రిటెన్షన్..
2026 సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్‌ను ఐపీఎల్ 2027 కోసం ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోనుందని తెలుస్తోంది. ఒక్క సీజన్ వైఫల్యంతో ప్లేయర్లను వదిలేసే సంస్కృతి తమది కాదని, 'వన్ ఫ్యామిలీ' సిద్ధాంతానికి కట్టుబడి ఉంటామని మేనేజ్‌మెంట్ తెలిపింది. హెడ్ కోచ్ గా మహేల జయవర్ధనే మరో ఏడాది పాటు సేవలందించనున్నాడు. మెగా వేలానికి ముందు చివరి ఏడాది కావడంతో జట్టులో పెను మార్పులు చేయకుండా స్థిరత్వాన్ని కాపాడుకోవాలని ముంబై యోచిస్తోంది.
Author : Ayesha</

