Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jagan PA KNR liquor scam investigation: ఏపీ లిక్కర్ స్కాంలో  జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?

Jagan PA KNR liquor scam investigation: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?

ABP దేశం 2 weeks ago

AP Liquor Scam Jagan PA KNR investigation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, ఆయన నీడలా ఉండే వ్యక్తిగత సహాయకుడు కే.

నాగేశ్వరరెడ్డి చుట్టూ సిట్ ఉచ్చు బిగుస్తోంది. వరుసగా రెండో రోజు ఆయనను సుదీర్ఘంగా విచారించడం, ఆయన ఆర్థిక సామ్రాజ్యంపై వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ మోహన్ రెడ్డి పక్కనే ఉండి చక్రం తిప్పిన కేఎన్ఆర్ను సిట్ అధికారులు విజయవాడ కార్యాలయంలో విచారిస్తున్నారు. బుధవారం సుమారు 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, పలు ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో గురువారం కూడా విచారణకు రావాలని ఆదేశించారు. గురువారం అంతా ఆయనను ప్రశ్నిస్తున్నారు. కేఎన్ఆర్ భార్య పేరిట ఉన్న బ్యాంక్ ఖాతాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడులపై సిట్ గురిపెట్టింది.

దిగువ మధ్యతరగతి నుంచి వందల కోట్ల సంపద?

వైసీపీ అధికారంలోకి రాకముందు కేఎన్ఆర్ ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి అని, ఆయనకు పెద్దగా ఆదాయ వనరులు లేవని సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. అయితే, 2019-24 మధ్య కాలంలో ఆయన ఆర్థిక స్థితి ఊహించని రీతిలో పెరిగింది. తిరుపతి జిల్లా కేవీబీ పురంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంతో కలిసి కొనుగోలు చేసిన 47 ఎకరాల వెంచర్లో.. కేఎన్ఆర్ భార్య శశికళ పేరుతో 10 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. రికార్డుల్లో ఎకరం రూ. 8 లక్షలుగా చూపినప్పటికీ, అసలు విలువ కోట్లలో ఉంటుందని, అది లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన లంచం వాటానేనని సిట్ బలంగా అనుమానిస్తోంది.

భార్య ఖాతాలో రూ. 19.85 కోట్ల మిస్టరీ

కేఎన్ఆర్ భార్య బ్యాంక్ ఖాతాల్లోకి గత ఐదేళ్లలో సుమారు రూ. 19.85 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించగా.. కుటుంబ వ్యాపారాల ద్వారా వచ్చింది అని ఆయన బదులిచ్చారు. అయితే, ఆయా సంస్థల టర్నోవర్కు, జమ అయిన మొత్తానికి ఎక్కడా పొంతన లేదని సిట్ తేల్చింది. విజయవాడ శివార్లలోని రామవరప్పాడులో ఉన్న ఒక భారీ కార్ షోరూమ్లో కేఎన్ఆర్ కేవలం రూ. 2-3 కోట్లు పెట్టుబడి పెట్టి 50 శాతం వాటాను ఎలా దక్కించుకున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

జగన్ బినామీనా? వ్యక్తిగత ఆస్తులా?

సిట్ ప్రధానంగా రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఒకటి.. కేఎన్ఆర్ తన హోదాను వాడుకుని సొంతంగా సంపాదించారా? లేదా ఆయన పేరిట ఉన్న ఆస్తులన్నీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెందిన బినామీ ఆస్తులా? అన్నది తేల్చాల్సి ఉంది. లిక్కర్ సిండికేట్ నుంచి వచ్చే నెలవారీ మామూళ్లు కేఎన్ఆర్ ద్వారానే పైకి వెళ్లేవని సాక్ష్యాధారాలు లభించినట్లు సమాచారం. ఒకవేళ కేఎన్ఆర్ను అరెస్టు చేస్తే, ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిరూపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

జగన్కు ముంచుకొస్తున్న ముప్పు

కేఎన్ఆర్ వంటి నమ్మకస్తుడైన వ్యక్తి అరెస్టయితే, అది జగన్ మోహన్ రెడ్డికి పెద్ద రాజకీయ దెబ్బ కానుంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ , ఐటీ శాఖలు రంగంలోకి దిగాయి. దాదాపు రూ. 3,500 కోట్ల కుంభకోణంగా చెబుతున్న ఈ వ్యవహారంలో.. కిక్బ్యాక్లు, హవాలా మార్గాల్లో నగదు మళ్లింపు జరిగిందని సిట్ చార్జిషీట్లో పేర్కొంది. ఏ క్షణమైనా కేఎన్ఆర్ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు అపరిమితమైన శక్తిగా వెలిగిన కేఎన్ఆర్, నోరు విప్పితే లిక్కర్ స్కాంలోని పెద్ద తలకాయలు బయటకు రావడం ఖాయం. ఒక సామాన్య పీఏ స్థాయి వ్యక్తి వందల కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టారనే ప్రశ్నకు సమాధానం దొరికితే.. ఏపీ మద్యం పాలసీ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో తేలిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam