Dailyhunt
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?

JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?

ABP దేశం 5 days ago

Jana Sena MLAs are creating problems for the party: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లీన్ పాలిటిక్స్ నినాదంతో వచ్చిన జనసేన పార్టీకి ఇప్పుడు తన సొంత ఎమ్మెల్యేల వ్యవహారశైలి పెద్ద సవాలుగా మారింది.

100 శాతం స్ట్రైక్ రేట్తో 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు వారిపై వస్తున్న వరుస ఆరోపణలతో డిఫెన్స్లో పడాల్సి వస్తోంది. కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేల అతి ఉత్సాహం, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక ఆరోపణలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

అరవ శ్రీధర్ వివాదం - పార్టీకి తలనొప్పి

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీకి నైతిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఆపై బాధితురాలిపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. హైకమాండ్ ఈ విషయంలో త్వరితగతిన స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ అయోమయానికి గురవుతోంది. తప్పు చేస్తే సొంత వారినైనా వదలను అని చెప్పే పవన్ కళ్యాణ్, ఈ విషయంలో మౌనం వహించడం ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది.

విశాఖ శివారు ఎమ్మెల్యే - వసూళ్ల పర్వం?

విశాఖపట్నం శివారు నియోజకవర్గాల పరిధిలోని ఒక కీలక ఎమ్మెల్యేపై పారిశ్రామికవేత్తల నుండి, రియల్టర్ల నుండి భారీగా వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ముఖ్యంగా భూ వివాదాల్లో తలదూర్చడం, సెటిల్మెంట్లు చేయడం వంటి పాత రాజకీయ వాసనలు జనసేన ఎమ్మెల్యేల నుంచి రావడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇలాంటి ఆర్థిక ఆరోపణలు రావడం భవిష్యత్తులో పార్టీ ఉనికికే ప్రమాదకరంగా మారవచ్చు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి చుట్టూ ఇప్పుడు మనీలాండరింగ్ ఆరోపణలు తిరుగుతున్నాయి. విచారణ సంస్థల వద్ద ఉన్న సమాచారం అంటూ వస్తున్న వార్తలు జనసేనను ఇరకాటంలోకి నెట్టాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ అవినీతి రహిత పాలన గురించి మాట్లాడుతుంటే, మరోవైపు కీలక మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం పార్టీకి కొత్త సమస్యలను సృష్టిస్తోంది.

అధికార గర్వం - అపరిపక్వత

జనసేన ఎమ్మెల్యేలలో అత్యధికులు రాజకీయాలకు కొత్త వారు కావడమే ఈ సమస్యలకు మూలమని భావిస్తున్నారు. తొలిసారి అధికారం దక్కడంతో, దానిని ఎలా నిర్వహించాలో తెలియక కొందరు అహంకారం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, నియోజకవర్గాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ అపరిపక్వత పవన్ కళ్యాణ్ కష్టపడి సంపాదించిన విశ్వసనీయత ను దెబ్బతీస్తోంది.

పవన్ హెచ్చరికలు - ఫలితమెంత?

ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై, ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఉపేక్షించేది లేదు అని ఘాటుగా హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై రహస్యంగా సర్వేలు చేయిస్తున్నానని, అవినీతికి పాల్పడితే టికెట్లు ఉండవని కూడా స్పష్టం చేశారు. జనసేన పార్టీ భవిష్యత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకునే కఠిన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. కేవలం సలహాలు, సూచనలతో సరిపెట్టకుండా, వివాదాస్పద ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం లేదా బాధ్యతల నుండి తప్పించడం వంటి చర్యలు తీసుకుంటేనే పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నిలుస్తుందని భావిస్తున్నారు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam