Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janasena TDP Local Body Elections:  క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !

Janasena TDP Local Body Elections: క్యాడర్ అంచనాలు ఆకాశంలో - స్థానిక ఎన్నికల్లో జనసేనకు లిట్మస్ టెస్ట్ !

ABP దేశం 1 month ago

Janasena Cadre Expectations TDP Formula: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార కూటమిలో అంతర్గత గందరగోళం మెల్లగా బయటపడుతోంది.

ముఖ్యంగా జనసేన పార్టీ వర్గాలు, సోషల్ మీడియా వేదికగా తమకు ఏ ఏ పంచాయతీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ వార్డులు కేటాయించాలనే దానిపై భారీ అంచనాలతో సీట్ల జాబితాలను వైరల్ చేస్తున్నాయి. శాసనసభ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించామని, కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా తమ ఆత్మగౌరవం దెబ్బతినకుండా గట్టిగా సీట్లు సాధించుకోవాలని జనసైనికులు పట్టుబడుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో అసెంబ్లీ పొత్తు ఫార్ములా వేరు, లోకల్ బాడీ ఫార్ములా వేరు అనే భావనతో ఉన్న టీడీపీ వర్గాలకు, జనసేన క్యాడర్ ఆశలకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తోంది.

క్యాడర్ ఆత్మగౌరవం నినాదం

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపే పరమావధిగా పవన్ కళ్యాణ్ త్యాగాలకు సిద్ధపడి తక్కువ సీట్లకు అంగీకరించారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఫార్ములా కుదరదని, పార్టీ సంస్థాగత బలోపేతానికి కార్యకర్తలకు స్థానిక పదవులు దక్కడం అత్యంత అవసరమని పవన్ ఇప్పటికే ప్రాథమిక సంకేతాలు ఇచ్చారు. తమ పార్టీ శ్రేణులు మూడేళ్లుగా కష్టపడినా నామినేటెడ్ పదవులు ఎక్కువగా టీడీపీకే దక్కాయని, కనీసం స్థానిక పోరులోనైనా తమకు తగిన స్థానాలు సాధించకపోతే క్యాడర్ నిరాశలోకి వెళ్లిపోతుందని జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆందోళన చెందుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధినేతల మధ్య కుదిరిన ఓట్ల బదిలీ .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డులు, పంచాయతీల స్థాయికి వచ్చేసరికి వ్యక్తిగత శత్రుత్వాలు, లోకల్ క్యాడర్ ఆధిపత్య పోరు కారణంగా తీవ్ర సవాలుగా మారనుంది.

గెలుపు గుర్రాలకే పీఠం సిద్ధాంతం

స్థానిక ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్, ఆర్థిక బలం, సొంత వర్గం పట్టు ప్రధాన భూమిక పోషిస్తాయి. టీడీపీ వాదన ప్రకారం.. కేవలం పార్టీ కోటా కింద సీట్లు కేటాయిస్తే ప్రత్యర్థి వైఎస్సార్సీపీ లబ్ధి పొందే ప్రమాదం ఉంది. కాబట్టి ఏ పార్టీ అన్నదానికంటే ఎవరు నిలబడితే గెలుస్తారు అనేదే ప్రామాణికం కావాలని టీడీపీ వర్గాలు అంతర్గతంగా భావిస్తున్నాయి. ఒకవేళ జనసేన డిమాండ్ మేరకు బలమైన టీడీపీ నాయకులు ఉన్న చోట స్థానాలను కేటాయిస్తే, అక్కడ టికెట్ దక్కని టీడీపీ నేతలు ఇండిపెండెంట్లుగా లేదా రెబెల్స్గా బరిలోకి దిగే ప్రమాదం ఉంది. ఇది అంతిమంగా కూటమికి నష్టం చేకూర్చే అంశం. ఒకవేళ జనసేన ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేకపోతే, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తారా అనేది అతిపెద్ద సందేహం. తమ నాయకుడికి లేదా తమ వర్గానికి ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఓట్ల బదిలీ సజావుగా జరగక నిర్లిప్తత ఆవహించే అవకాశం ఉంది.

అగ్రనాయకత్వానికి సవాల్

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న సమన్వయం క్షేత్రస్థాయిలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో లేదన్నది బహిరంగ రహస్యమే. స్థానిక పోరులో ప్రతి వార్డులోనూ ఇరు పార్టీల ఆశావాహులు పోటీ పడుతుండటంతో ఈ అసంతృప్తిని చల్లార్చడం ఇద్దరి నేతలకూ కత్తిమీద సాము లాంటిదే. పవన్ కళ్యాణ్ తన క్యాడర్ ఆశలను నెరవేరుస్తూనే కూటమి ఐక్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు సంతృప్తికరమైన స్థాయిలో సీట్లు దక్కకపోతే, ఆ పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో సైలెంట్ అయ్యే ముప్పు ఉంది. అదే సమయంలో గెలిచే అవకాశం లేని స్థానాల్లో పట్టుబడితే కూటమికి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదమూ ఉంది. సమన్వయ కమిటీల ద్వారా పారదర్శకమైన సర్వేలు నిర్వహించి, ఇరు పార్టీల శ్రేణులను ఒప్పించి బరిలోకి దింపితేనే కూటమి విజయం స్థానిక సంస్థల్లోనూ పునరావృతమవుతుంది.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam