TRS chief Kavitha arrested Bollaram PS: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గురువారం నాడు ఉప్పల్ భగాయత్ వేదికగా తలపెట్టిన భూపోరాటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు తరలి రావడంతో ఉప్పల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ప్రభుత్వ ఇళ్ల స్థలాన్ని తక్షణమే కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో ఈ నిరసన చేపట్టారు.
ముందస్తు వ్యూహంలో భాగంగా ఉప్పల్ భగాయత్ గ్రౌండ్స్లో నిర్వహించాలనుకున్న భూపోరాట సభను పోలీసులు భారీ బారికేడ్లతో అడ్డుకోవడంతో కవిత తన వ్యూహాన్ని మార్చారు. ఎలాగైనా నిరసన గళాన్ని వినిపించి తీరుతామని సభా వేదికను మేడిపల్లి - చెంగిచెర్ల, బోడుప్పల్ సరిహద్దుల్లో ఉన్న భగయత్ నగర్ మైదానానికి మార్చారు. కవిత నేతృత్వంలో కార్యకర్తలంతా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా హైడ్రామా నెలకొంది. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న వందలాది మంది పోలీస్ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేశాయి.
ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ రక్షణ సేన శ్రేణులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నించడంతో అక్కడ లాఠీచార్జ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తీవ్రమైన తోపులాట మధ్య కల్వకుంట్ల కవిత నియంత్రణ కోల్పోయి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతులు, మోకాళ్లకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రభుత్వం తాము అడిగిన న్యాయమైన డిమాండ్లపై చర్చించకుండా, ఇలా పోలీసులతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యమా అని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు కవితను, ఇతర ముఖ్య నేతలను బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. ఆమెను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు అక్కడి నుండి నేరుగా బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించాయి. తాము కేవలం ఎన్నికల హామీలను నెరవేర్చాలని శాంతియుతంగా పోరాడుతుంటే, ప్రభుత్వం లాఠీలు, రబ్బరు తూటాలతో భయపెట్టాలని చూస్తోందని, ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని కవిత స్టేషన్ నుంచి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ వార్త తెలియడంతో బొల్లారం పోలీస్ స్టేషన్ వద్దకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ భూపోరాట పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించి, భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని, కానీ తమ పార్టీ నిరుద్యోగులు, మహిళలు, ఉద్యమకారుల పక్షాన నిరంతరం పోరాడుతుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఘటనతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి 'తెలంగాణ రక్షణ సేన' క్షేత్రస్థాయిలో మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో విశ్లేషణలు వస్తున్నాయి.
Author : Raja Sekhar Allu

