Karnataka Politics | బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ శుక్రవారం ఉదయం ఆమోదించారు.
అంతకుముందు రోజు గవర్నర్ మధ్యప్రదేశ్లో ఉన్న సమయంలో, సీఎం సిద్ధరామయ్య రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గురువారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు చేరుకున్న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, నేటి (మే 29న) ఉదయాన్నే ఈ రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతారని గవర్నర్ గెహ్లాట్ పేర్కొన్నారు.
ఢిల్లీకి సిద్ధరామయ్య.. కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య గురువారం సాయంత్రమే పలువురు సీనియర్ నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో అత్యవసరంగా భేటీ అయి తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అదే సమయంలో కర్ణాటకలో తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలి, కొత్త మంత్రివర్గం కూర్పు ఎలా ఉండాలి అనే అంశాలపై హైకమాండ్తో సిద్ధరామయ్య సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో సమావేశంలో ఆయనను రాజ్యసభకు పంపిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
రేపు కర్ణాటక సీఎల్పీ సమావేశం
కర్ణాటక కాంగ్రెస్ నేతల సీఎల్పీ సమావేశం రేపు జరగనుంది. సీఎల్పీ నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం ద్వారా కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. అయితే డీకే శివకుమార్ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఇదివరకే స్పష్టమైంది. సీఎంగా ప్రమాణ స్వీకారానికి మంచి ముహూర్తం కోసం డీకే శివకుమార్ సిద్ధాంతిని కలిసి చర్చించారు. ఓ మంచి ముహూర్తంలో ప్రమాణం చేస్తే 8 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగుతారని జ్యోతిష్కుడు ద్వారకనాథ్ సూచించారని తెలుస్తోంది.
హైకమాండ్ ఆదేశమే శిరోధార్యం: సిద్ధరామయ్య
సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రిగా సేవలందించే అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత మూడేళ్లుగా తన ప్రభుత్వానికి, పాలనకు పూర్తి స్థాయిలో సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన ప్రసంగంలో పార్టీలోని 'పవర్ షేరింగ్' ఒప్పందాన్ని గౌరవిస్తున్నట్లు పరోక్షంగా సూచించిన సిద్ధరామయ్య, భవిష్యత్తులో పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ప్రకటించారు.
Karnataka Politics Updates:కర్ణాటకలో సిద్ధరామయ్య సైలెంట్గా తప్పుకుంటున్నారా? డీకేకు చిక్కులు తప్పవా?
డీకే శివకుమార్ పట్టాభిషేకం ఖాయం
సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు రూట్ క్లియర్ అయింది. అంతకుముందు గురువారం ఉదయం జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సిద్ధరామయ్య స్వయంగా తన సహచర నాయకులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ భావోద్వేగంతో సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే తరువాత నాకు మీ మద్దతు అవసరం అనే సంకేతాలిచ్చారు. మే 29 సాయంత్రం జరగబోయే కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో శివకుమార్ను శాసనసభా పక్ష నేతగా అధికారికంగా ఎన్నుకోనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Author : Shankar Dukanam

