Benefits of Swimming for Children : సమ్మర్లో పిల్లలను చాలామంది స్విమ్మింగ్ క్లాసులకు తీసుకెళ్తారు. సెలవుల్లో వారికి టైమ్ పాస్ కావడంతో పాటు.. నీటితో వారు ఎక్కువ ఎంజాయ్ చేస్తారనేది మేజర్ కాన్సప్ట్.
కానీ ఇది శారీరిక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. పిల్లలు రెగ్యులర్‌గా స్విమ్మింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్విమ్మింగ్ బెనిఫిట్స్..
స్విమ్మింగ్ వల్ల పిల్లల శరీరమంతా వ్యాయామం అవుతుంది. చేతులు, కాళ్లు, వీపు, గుండె అన్ని భాగాలూ ఒకేసారి పని చేస్తాయి. దీనివల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఎముకలు గట్టిపడతాయి. నీటిలో ఈదినప్పుడు గుండె వేగంగా పని చేసి.. హార్ట్ హెల్త్ మెరుగవుతుంది. ఆస్తమా ఉన్న పిల్లలు స్విమ్మింగ్ వల్ల శ్వాస సమస్యలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఆరోగ్యం కూడా..
మానసికంగా కూడా స్విమ్మింగ్ పిల్లలకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. నీటిలో ఈదే ప్రతిసారీ పిల్లలు కొత్త సవాళ్లను అధిగమిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. మొదట్లో నీటికి భయపడే పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత ధైర్యంగా తయారవుతారు. ఈ ధైర్యం జీవితంలో అన్ని రంగాల్లోనూ రాణించేందుకు సహాయపడుతుంది.
చదువు ఒత్తిడి తగ్గించడంలో కూడా స్విమ్మింగ్ అద్భుతంగా పని చేస్తుంది. నీటిలో ఈదిన తర్వాత మెదడు రిలాక్స్ అవుతుంది. నిద్ర బాగా పడుతుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.
జీవితాన్ని కాపాడే స్కిల్ ఇది..
స్విమ్మింగ్ అనేది జీవితాన్ని రక్షించే స్కిల్‌గా చెప్పవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. స్విమ్మింగ్ తెలిసిన పిల్లలు అటువంటి ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకోగలరు. ఇతరులను కాపాడగలుగుతారు.
స్విమ్మింగ్ పూల్లో ఇతర పిల్లలతో కలిసి ఈదడం వల్ల సామాజిక నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. కలిసి పని చేయడం, స్నేహంగా ఉండటం, పోటీ స్ఫూర్తి అనేవి సహజంగా నేర్చుకుంటారు. కాబట్టి వేసవిలో పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడమనేది మంచి ఆప్షన్. ఇది పిల్లలకు కేవలం స్కిల్ మాత్రమే కాదు.. వారికి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ కూడా అవుతుంది.
Author : Geddam Vijaya Madhuri

