Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Konda Surekha: కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?

Konda Surekha: కొండా దంపతుల ప్లాన్ బి - హైకమాండ్ నిర్ణయం వరకూ సైలెంట్ - తర్వాత ఏం చేయబోతున్నారు?

ABP దేశం 1 week ago

Konda Surekha Resignation Rumours MLA Post: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, సొంత శాఖలోనూ తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం పూర్తిస్థాయి మౌనం పాటిస్తున్నారు.

బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన వైఖరిని, ఎదురవుతున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించి వచ్చిన తర్వాత ఆమె వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇకపై మీడియాతో మాట్లాడేది లేదని తెగేసి చెప్పడం, క్రమశిక్షణా కమిటీ అధిష్టానానికి నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకపోవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తోంది.

హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్

తన శాఖలోని అధికారులను తనకు తెలీకుండానే మాతృశాఖలకు పంపడం, ఓఎస్డీ సెటిల్మెంట్ల వ్యవహారంలో చట్టపరమైన విచారణలు వేగవంతం కావడం వంటి అంశాలపై సురేఖ తన అసంతృప్తిని ఇప్పటికే హైకమాండ్ ముందు ఉంచారు. అధిష్టానానికి పరిస్థితిని వివరించిన తర్వాత, తన బాధ్యత ముగిసిందన్నట్లుగా ఓ రోజు సెక్రటేరియట్లో విధులు నిర్వహించిన ఆమె.. ఇప్పుడు వెయిట్ అండ్ సీ ధోరణిని అవలంబిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? తనను కేబినెట్ నుంచి తప్పిస్తుందా లేక నష్ట నివారణ చర్యలు చేపడుతుందా అనే అంశం ఆధారంగానే సురేఖ దంపతులు తమ తదుపరి అడుగులు వేయనున్నారు.

మాట్లాడితే వివాదం.. మౌనం పాటిస్తే వ్యూహం.

కొండా సురేఖ ప్రస్తుత సైలెన్స్ కేవలం నిశ్శబ్దం కాదు, అధిష్టానం నిర్ణయం ఆధారంగా రాజకీయ దారి మార్చుకోవడానికి వేస్తున్న ముందస్తు ప్రణాళికగా అనుకోవచ్చు. ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలకే మొగ్గు చూపి, ఆమెతో బలవంతంగా మంత్రి పదవికి రాజీనామా చేయిస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత చరిత్రను పరిశీలిస్తే కొండా సురేఖ దంపతులు ఏ పార్టీలో ఉన్నా తమ స్వయంప్రతిపత్తిని, ఆత్మగౌరవాన్ని వదులుకునేందుకు సిద్ధపడలేదు. కేవలం మంత్రి పదవి ఊడిపోవడమే కాకుండా పార్టీలో ప్రాధాన్యత తగ్గితే.. ఆమె కేవలం కాంగ్రెస్లోనే ఉండిపోతారా లేక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తమ సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పులో సవాలు విసురుతారా అనేది కీలక ప్రశ్న.

మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా

మంత్రి పదవిని కోల్పోతే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి బై-ఎలక్షన్ కు వెళ్లే సాహసం కొండా మురళి, సురేఖ దంపతులు చేయవచ్చనే టాక్ వరంగల్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది. తమకున్న బలమైన బిసి కేడర్, వ్యక్తిగత ఇమేజ్ను నమ్ముకుని ఉపఎన్నికకు వెళ్లడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి , కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి రాజకీయ సవాలు విసిరే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తమపై కఠిన చర్యలు తీసుకుంటే, బిసి సెంటిమెంట్ను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ ఉపఎన్నిక మార్గాన్ని ఎంచుకోవచ్చు. తెలంగాణలో బలపడేందుకు చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఉత్తర తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో సామాజిక సమీకరణాల దృష్ట్యా బలమైన బిసి నాయకత్వం కోసం వెతుకుతోంది. కొండా సురేఖ దంపతులకు బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బీజేపీ ఆప్షన్ ఉండనే ఉంది!

ఒకవేళ కాంగ్రెస్ నుంచి వైదొలిగితే బిజెపి తీర్థం పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థిగా సార్వత్రిక లేదా ఉపఎన్నికల బరిలోకి దిగడం సురేఖ దంపతులకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. కొండా సురేఖ మౌనం అనేది తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. అధిష్టానం ఇచ్చే ఫైనల్ రిపోర్టు లేదా తీసుకునే నిర్ణయమే తెలంగాణ కాంగ్రెస్లో మరో రాజకీయ ఆధిపత్య రగడకు దారితీస్తుందా లేదా అనేది తేల్చనుంది. కొండా దంపతుల తదుపరి అడుగు కాంగ్రెస్ పార్టీకి వరంగల్ రీజియన్లో మునుపటి కంటే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని అనుకోవచ్చు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam