Lesson for regional parties that are trying to meddle in national politics: ప్రాంతీయ పార్టీల మనుగడకు సంబంధించి భారత రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది.
సొంత రాష్ట్రం వదిలి జాతీయ ఆకాశంలోకి ఎగరాలనుకోవడం.. రెక్కలు విరగ్గొట్టుకోవడమేనా అనే ప్రశ్నకు ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకులుగా వెలుగొందుతూ, ఎప్పుడైతే వారు జాతీయ రాజకీయాలపై కన్నేశారో, అప్పుడే వారి సొంత కోటలు కూలిపోవడం ప్రారంభమవుతున్నాయి. ఈ పరిణామాన్ని విశ్లేషిస్తే ప్రాంతీయ పార్టీల వైఫల్యాల వెనుక ఉన్న నేషనల్ అంబిషన్ స్పష్టంగా కనిపిస్తుంది.
చంద్రబాబు పాఠం - సరిదిద్దుకున్న వ్యూహం
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2018-19 సమయంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నించి, సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. జాతీయ స్థాయిలో కూటములను కలపడంపై పెట్టిన దృష్టి, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యేలా చేసింది. అయితే, ఆ తప్పును గుర్తించిన ఆయన, మళ్ళీ లోకల్ పాలిటిక్స్కే పరిమితమై, బీజేపీతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుని అధికారాన్ని దక్కించుకోవడం ఒక రాజకీయ పాఠం. ప్రాంతీయ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలే ప్రధమ ప్రాధాన్యత అని ఆయన నిరూపించారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు - కేసీఆర్ పతనం
తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఉన్న కేసీఆర్, తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడమే ఆయన పతనానికి ఆరంభమైంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం వల్ల, తెలంగాణ ప్రజల్లో తమ సమస్యలను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు అనే భావన కలిగింది. ఫలితంగా పదేళ్ల అధికారాన్ని కోల్పోవడమే కాకుండా, లోక్ సభ ఎన్నికల్లో జీరోకి పరిమితమవడంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
కేజ్రీవాల్ , ఠాక్రే - గందరగోళంలో కోటలు
ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ పడ్డ తాపత్రయం ఆయనను జైలు పాలు చేయడమే కాకుండా, పార్టీలో సంక్షోభానికి దారితీసింది. పంజాబ్ లో గెలిచినప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో విస్తరణ ప్రయత్నాలు ఢిల్లీ పాలనపై ప్రభావం చూపాయి. అటు మహారాష్ట్రలో శివసేనను జాతీయ స్థాయిలో సెక్యులర్ ఇమేజ్ కోసం మలచాలని చూసిన ఉద్ధవ్ ఠాక్రే, తన సొంత పార్టీని, ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు అక్కడ షిండే వర్గం , బీజేపీ హవా ముందు ఠాక్రే వారసత్వం వెలవెలబోతోంది.
మమత , స్టాలిన్ - బెంగాల్, తమిళనాడు షాక్
ఇప్పుడు మమతా బెనర్జీ , ఎం.కె. స్టాలిన్ ఎదుర్కొన్న పరాజయం ఈ వాదనకు బలాన్నిస్తోంది. మమత గత రెండేళ్లుగా ఇండియా కూటమికి నాయకత్వం వహించాలని, త్రిపుర, గోవా వంటి రాష్ట్రాల్లో పోటీ చేయాలని చేసిన ప్రయత్నాలు బెంగాల్ పై ఆమె పట్టును సడలించాయి. స్టాలిన్ సైతం జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేక గళం వినిపిస్తూ, ద్రవిడ మోడల్ ను దేశమంతా ప్రచారం చేయాలని చూశారు. కానీ, ప్రజలు తమ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించని నాయకులు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటాన్ని అంగీకరించడం లేదని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయి.
వాక్యూమ్ ను భర్తీ చేస్తున్న జాతీయ పార్టీలు
ప్రాంతీయ నేతలు తమ దృష్టిని రాష్ట్రం దాటించిన ప్రతిసారీ, అక్కడ ఒక రాజకీయ శూన్యం ఏర్పడుతోంది. బెంగాల్ లో మమత సృష్టించిన ఆ శూన్యాన్ని బీజేపీ సమర్థవంతంగా భర్తీ చేసింది. తమిళనాడులో స్టాలిన్ వదిలేసిన ప్రాంతీయ సెంటిమెంట్ ను విజయ్ తన తమిళగ వెట్రి కళగం ద్వారా సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలు తమ మౌలిక సిద్ధాంతాలను, స్థానిక ప్రజల అవసరాలను విస్మరించి జాతీయ నాయకులుగా ఎదగాలని కోరుకోవడం వల్ల.. అటు జాతీయ స్థాయిలో స్థానం దక్కక, ఇటు సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోయే పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతున్నాయి.
భారత రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు మారిపోతోంది. ప్రజలు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి-సంక్షేమం అందించే నాయకుడిని కోరుకుంటున్నారు తప్ప, తమ ఓటుతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పే కింగ్ మేకర్ల ను కాదు. ఏ ప్రాంతీయ పార్టీ అయితే తన మట్టిని మర్చిపోయి ఢిల్లీ పై కన్నేస్తుందో, ఆ పార్టీకి పతనం తప్పదని కేసీఆర్ నుండి మమత వరకు అందరి చరిత్రలు హెచ్చరిస్తున్నాయి. లోకల్ గా అవుట్ అవ్వకుండా ఉండాలంటే, ప్రాంతీయ పార్టీలు తమ పరిధిని గుర్తించి నడుచుకోవడమే శ్రేయస్కరమని నిరూపిస్తున్నాయి.
Author : Raja Sekhar Allu

