హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిజాంపేట్ సర్కిల్లో సోమవారం అర్ధరాత్రి వేళ ఈ ఘటన జరిగింది.
ఈ అగ్ని ప్రమాదంలో వరుసగా ఉన్న ఆరు ఫర్నిచర్ షాపులు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దుకాణాల్లో నిల్వ ఉంచిన భారీ ఫర్నిచర్ సామాగ్రి అగ్నికి ఆహుతి కావడంతో సుమారు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు సమన్వయంతో గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ఇటీవల కాలంలోనే ఇదే ప్రాంతంలో మరో అగ్నిప్రమాదం జరగడం, మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటనే జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రతి వేసవికాలంలో ఇదే తీరుగా నగరంలో ఏదో చోట తరచుగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి.
Author : Shankar Dukanam

