Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!

మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!

ABP దేశం 1 week ago

Vehicle to Vehicle Communication: కారు నడుపుతున్నప్పుడు ఒక్క క్షణం నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ముఖ్యంగా మలుపులు, పొగమంచు, భారీ ట్రాఫిక్ లేదా ముందున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది.

కానీ ఇకపై అలాంటి సందర్భాల్లో మీ కారు ముందే ప్రమాదాన్ని గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తే ఎలా ఉంటుంది?. ఇది వినడానికి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కథలా అనిపించినా.. త్వరలోనే భారతీయ రోడ్లపై ఇది నిజం కానుంది. వెహికల్‌ టు వెహికల్‌ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీతో ఇది సాధ్యమవుతుంది.

దేశంలో రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వెహికల్‌ టు వెహికల్‌ (Vehicle to Vehicle) కమ్యూనికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 సవరణలపై రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.

V2V అంటే...

V2V అంటే, ఒక వాహనం మరో వాహనంతో నేరుగా సమాచారాన్ని పంచుకోవడం. అంటే కార్లు, బస్సులు లేదా ఇతర వాహనాలు తమ వేగం, దిశ, స్థానం, యాక్సెలరేషన్ వంటి కీలక సమాచారాన్ని రియల్ టైమ్‌లో పరస్పరం షేర్ చేసుకుంటాయి. దీంతో కంటికి కనిపించని ప్రమాదాలను కూడా ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు... మీ ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే, ముందున్న మలుపు కారణంగా దానిని మీరు చూడలేకపోయినా V2V సిస్టమ్ ద్వారా మీ కారు వెంటనే అలర్ట్ ఇస్తుంది. దానివల్ల మీరు తక్షణమే మీ కారు వేగాన్ని తగ్గించడమో, పక్క లేన్‌లోకి మారడమో చేయడం ద్వారా ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. ఎదురుగా వస్తున్న వాహనంతో ఢీకొనే ప్రమాదం, ఆకస్మికంగా లేన్ మార్పు, ట్రాఫిక్‌లో ప్రమాదకర పరిస్థితులు, అత్యవసర సేవల వాహనాల రాక వంటి అంశాలపై కూడా ఈ వ్యవస్థ ముందుగానే హెచ్చరికలు అందిస్తుంది. దీంతో డ్రైవర్‌కు స్పందించే సమయం పెరిగి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

: BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!

కనిపించని ప్రమాదాల నుంచి కూడా రక్షణ
ప్రస్తుతం వాహనాల్లో ఉండే సేఫ్టీ ఫీచర్లు ఎక్కువగా కెమెరాలు, రాడార్లు, సెన్సర్లపై ఆధారపడతాయి. అవి కనిపించే వస్తువులను మాత్రమే గుర్తిస్తాయి. కానీ V2V టెక్నాలజీ మాత్రం వాహనాల మధ్య నేరుగా సమాచార మార్పిడి జరిపి కనిపించని ప్రమాదాల గురించి కూడా ముందుగానే హెచ్చరిస్తుంది. అందుకే దీన్ని రోడ్డు భద్రతలో మరో కీలక ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం, 2027 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే L, M & N కేటగిరీ వాహనాల్లో V2V వ్యవస్థను అమర్చినట్లయితే అది తప్పనిసరిగా AIS-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇక 2028 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే ఈ కేటగిరీ వాహనాలన్నింటిలోనూ AIS-230 ప్రమాణాలకు అనుగుణమైన V2V వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది.

: E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!

ఈ ముసాయిదాపై వాహన తయారీ సంస్థలు, నిపుణులు & ప్రజల నుంచి 30 రోజుల పాటు సూచనలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించనుంది. అనంతరం తుది నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

భారత్‌లో ప్రతి ఏడాది వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో AI ఆధారిత V2V టెక్నాలజీ వాహనాల మధ్య తెలివైన కమ్యూనికేషన్‌ను తీసుకువచ్చి ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత రోడ్లపై స్మార్ట్ & సేఫ్ డ్రైవింగ్‌కు ఇదే కొత్త ప్రమాణంగా మారే అవకాశాలున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Author : Arun Kumar Veera

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam