Musarambagh High Level Bridge Over Musi River | హైదరాబాద్: నగరంలోని అత్యంత కీలకమైన ముసారాంబాగ్, అంబర్పేట ప్రాంతాలను కలుపుతూ మూసీ నదిపై రూ.52 కోట్ల వ్యయంతో నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మించారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతూ ఈ నూతన బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీహెచ్ సహా పలువురు నేతలతో కలిసి బ్రిడ్జిపై నడిచారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారిక యంత్రాంగం అన్ని ముందగానే ఏర్పాట్లు పూర్తి చేసింది. ముసారాంబాగ్-అంబర్పేట హైలెవల్ బ్రిడ్జి ద్వారా ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్ విభాగం 2 ప్రధాన భాగాలుగా రూపకల్పన చేసి నిర్మిస్తోంది. అందులో భాగమైన ముసారాంబాగ్ వద్ద ఉన్న ఎడమవైపు (డౌన్ స్ట్రీమ్) వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.
వాకర్స్ కోసం ఫుట్పాత్
ఈ నూతన వంతెనపై పాదాచారుల భద్రత కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ప్రత్యేకం ఫుట్పాత్ను నిర్మించారు. అలాగే అప్రోచ్ రోడ్డు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తికావడంతో వాహనదారులకు విజిబిలిటీ మెరుగైంది. ప్రస్తుతం వంతెన కుడివైపు భాగానికి సంబంధించిన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటంతో, దానిని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని అధికారులు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. ఈలోగా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ముందుగా పూర్తయిన ఎడమవైపు బ్రిడ్జిపై నుంచే వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.

పాత బ్రిడ్జికి 10 మీటర్ల ఎత్తులో కొత్త బ్రిడ్జి
గతంలో మూసీ నదిపై ఉన్న పాత లో-లెవల్ బ్రిడ్జి స్థానంలో దానికి దాదాపు 10 మీటర్ల (32 అడుగులు) అదనపు ఎత్తులో ఈ కొత్త వంతెనను నిర్మించారు. జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల నుంచి ఒకేసారి 1.5లక్షల క్యూసెక్కుల మేర వరద నీళ్లు విడుదల చేసినప్పటికీ, ఈ కొత్త బ్రిడ్జి ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో మూసీకి వరద వచ్చిన ప్రతిసారి పాత తక్కువ ఎత్తు వంతెన మునిగిపోయి, అంబర్పేట-ముసారాంబాగ్ మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బండిపడుతున్నారు.

శంకుస్థాపన చేసిన బీఆర్ఎస్
ఈ ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబరు 24న ఈ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అయితే తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత 2024, 2025 సంవత్సరాల్లో వచ్చిన మూసీ వరద ప్రవాహాల వల్ల నిర్మాణ పనులకు కొంతకాలం ఆటంకం ఏర్పడి ఆలస్యమైంది. అన్ని అవరోధాలను అధిగమించి ఎట్టకేలకు ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో స్థానికులులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వంతెన ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే సీఎం రేవంత్రెడ్డి అంబర్పేట జీహెచ్ఎంసీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.
Author : Shankar Dukanam

