Dailyhunt
Nara Lokesh: 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - నారా లోకేష్ టార్గెట్

Nara Lokesh: 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ - నారా లోకేష్ టార్గెట్

ABP దేశం 4 days ago

Nara Lokesh laid foundation stone carrier industry: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే భారతదేశపు కూల్ క్యాపిటల్ గా అవతరించిందని మంత్రి లోకేష్ ప్రకటించారు.

ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏసీలలో గణనీయమైన భాగం ఏపీ నుంచే వస్తోందని, 2027 నాటికి దేశీయ ఏసీ ఉత్పత్తిలో 60 శాతం, 2028 నాటికి 80 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. క్యారియర్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ రూ. 1000 కోట్ల పెట్టుబడితో ఏపీకి రావడం రాష్ట్ర ఎకోసిస్టమ్ పట్ల ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

డేటా సెంటర్ పరికరాల తయారీలో ప్రపంచ నాయకత్వం

కేవలం డేటా సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటికి అవసరమైన కూలింగ్ సిస్టమ్స్, చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి పరికరాల తయారీలో ఏపీని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వివరించారు. ఫార్మా రంగంలో భారత్ ఏవిధంగా అగ్రగామిగా ఉందో, డేటా సెంటర్ కాంపోనెంట్స్ తయారీలో కూడా అదే స్థాయి నాయకత్వాన్ని సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చే ప్రక్రియలో ఇదొక కీలక అడుగు అని తెలిపారు.

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడులు కేవలం నిధుల కోసం మాత్రమే కాకుండా యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పన కోసమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నైపుణ్యం పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్

రాష్ట్రంలో ప్రస్తుతం నమో నరేంద్ర మోదీ - చంద్రబాబు నాయుడు కలయికతో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో పాలన సాగుతోందని మంత్రి అభివర్ణించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వ ప్రత్యేకతని, ఒక్క జూమ్ కాల్‌తోనే ఆర్సెలార్ మిట్టల్ వంటి సంస్థలను రాష్ట్రానికి రప్పించగలిగామని గుర్తుచేశారు. పరిశ్రమలకు ఏ అవసరం వచ్చినా కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలో ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు.

శ్రీసిటీ మేక్ ఇన్ ఇండియాకు రోల్ మోడల్

8,500 ఎకరాల్లో విస్తరించి, 31 దేశాలకు చెందిన 250 కంపెనీలతో శ్రీసిటీ ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా నిలిచిందని లోకేష్ కొనియాడారు. క్యారియర్ సంస్థ ఇక్కడ ప్లాంట్‌తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam