NEET UG 2026 Counselling: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాల తర్వాత, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది.
ఈ ఏడాది సుమారు 20 లక్షల మంది అర్హత సాధించారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నేటి నుంచి ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది.
ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే
కేంద్ర పరిధిలోని సీట్ల భర్తీకి సంబంధించి ఎంసీసీ స్పష్టమైన క్యాలెండర్ను విడుదల చేసింది. విద్యార్థులు తమ ప్రాధాన్యతలను బట్టి ఈ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు ఐదు నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్ నిర్వహిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22 లోపు సంబంధిత కాలేజీలకు వెళ్లి రిపోర్ట్ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 24 న ప్రారంభమై సెప్టెంబర్ 2న ముగుస్తుంది. మూడో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 18 వరకు నిర్వహిస్తారు. మిగిలిపోయిన సీట్ల కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు స్ట్రే వేకెన్సీ రౌండ్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో సీటు పొందిన వారు అక్టోబర్ పది నాటికి అడ్మిషన్ పూర్తి చేయాలి.
ఆంధ్రప్రదేశ్ సేట్ కోటా కౌన్సెలింగ్ వివరాలు
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్పై వైస్ ఛాన్స్లర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఈ నెల 13న ప్రారంభం కానుంది. మొదటి రౌండ్ ఆగస్టు 13 నుంచి 22 వరకు, రెండో రౌండ్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8వరకు మూడో రౌండ్ సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 26వరకు మిగిలిన సీట్ల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 5 వరకు ఉంటుంది.
నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులు ప్రారంభకానున్నాయి.
కొత్త రూల్స్ తెలియకపోతే ఇబ్బందే
గతంలో ఉన్న కొన్ని క్లిష్టమైన రూల్స్ను ప్రభుత్వం మార్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్ల నమోదుపై ఉన్న అనుమానాలకు తెరదించారు. 2020లో విడుదలైన జీవో 151 ప్రకారం విద్యార్థులు ఒకేసారి ఆప్షన్లు నమోదు చేసుకోవాలనే రూల్ ఉండేది. దీనిపై అభ్యంతరాలు రావడంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవో 102 తీసుకొచ్చి దాన్ని మార్చింది. కొత్త జీవో ప్రకారం మొదటి విడతలో సీటు రాని అభ్యర్థులు 2వ, మూడో కౌన్సెలింగ్లో కూడా తమ ఆప్షన్లను మార్చుకునే లేదా కొత్తగా పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు. రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో సీటు సాధించి తర్వాత మంచి కాలేజీ తన రిజర్వేషన్ కోటాలో వస్తే అక్కడికి మారవచ్చు. అప్పుడు ఖాళీ అయిన సీటును అదే కేటగిరీ అభ్యర్థికి ఇస్తారు.
పెరిగిన మెడికల్ సీట్లు
ఈ విద్యా సంవత్సరం వైద్య విద్యార్థులకు మరో శుభవార్త ఏంటంటే గత ఏడాది కంటే సీట్లు పెంచారు. గతంలో ఉన్న 6940 సీట్లకు అదనంగా మరో 325 సీట్లకు పెంపునకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది.
దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విద్యార్థులు ఎంసీసీ అధికారిక వెబ్సైట్ mcc.nic.in సందర్శించి దరఖాస్తు చేయాలి. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి. నిర్ణీత కౌన్సెలింగ్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. మీకు నచ్చిన కాలేజీ, కోర్సులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకొని గడువు లోపు లాక్ చేయాలి. ర్యాంక్, కేటగిరీ, సీట్ల లభ్యత ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు
కౌన్సెలింగ్కు హాజరైన సమయంలో విద్యార్థుల వద్ద కీలకమైన సర్టిఫికెట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. నీట్ యూజీ 2026 స్కోర్ కార్డు, అడ్మిట్ కార్డు, పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితా, గుర్తింపు కార్డు అంటే ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, పాస్పోర్ట్ సైజు ఫొటోలు, రెసిడెన్సీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్ దగ్గర ప పెట్టుకోవాలి.
మెడికల్ కౌన్సెలింగ్ అనేది అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన ప్రక్రియ. కేవలం అధికారిక వెబ్సైట్పైనే ఆధారపడాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అపోహలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Author : Khagesh

