Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

Patriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?

ABP దేశం 2 months ago

Mammootty Mohanlal Malayalam Movie Patriot Review In Telugu: మలయాళ సినిమా 'పేట్రియాట్'. సుమారు పదమూడేళ్ళ తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన సినిమా కావడం...

ఫహాద్ ఫాజిల్, నయనతార, దర్శనా రాజేంద్రన్, కుంచకో బోబన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించడం వల్ల మలయాళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల దృష్టి సైతం ఈ సినిమాపై పడింది. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ అతిథిగా చేశారు. లేదంటే ఆయనది ప్రత్యేక పాత్ర అనుకోవచ్చు. ఈ మలయాళ సినిమా ఎలా ఉందంటే?

కథ (Patriot Movie Story): డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) డీఆర్‌డబ్ల్యూలో సైంటిస్ట్. భారతావని భద్రతకు సంబంధించిన రహస్యాలు ఇతరులకు చేరవేసిన 'దేశ ద్రోహి' అని ఆరోపణలు రావడంతో హుటాహుటిన లండన్ వెళతారు. అక్కడ్నుంచి 'విమదన్' పేరుతో యూట్యూబ్‌లో తన అభిప్రాయాలు వెల్లడించడం మొదలు పెడతారు. డేనియల్ బయట పెట్టిన ఓ రహస్యం వల్ల మంత్రి తనయుడు, శక్తి కార్పొరేషన్ అధినేత శక్తి సుందరం (ఫహాద్ ఫాజిల్) చిక్కుల్లో పడతారు. దాంతో డానీ మీద హత్యాప్రయత్నం చేయిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది?

శక్తి కార్పొరేషన్‌లో డేటా అనలిస్ట్ జ్యోతి (దర్శనా రాజేంద్రన్), అంతకు ముందు నళిని రామకృష్ణన్ హత్యలకు కారణం ఎవరు? వాళ్ళు ఎలా మరణించారు? పేద విద్యార్థులకు శక్తి కార్పొరేషన్ అందించిన ల్యాప్‌టాప్స్‌ వల్ల ఏం జరిగింది? డేటా ప్రైవసీ / సీక్రెట్ డేటా చోరీ వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతున్నాయి? పేదలు ఎలా మోసపోతున్నారు? శక్తిని డేనియల్ జేమ్స్ ఎలా ఎదుర్కొన్నారు? ఆయనకు కల్నల్ రహీమ్ నాయక్ (మోహన్ లాల్) నుంచి ఎటువంటి మద్దతు లభించింది? లాయర్ లతిక (నయనతార), శక్తి సొల్యూషన్స్ ఉద్యోగి మైఖేల్ (కుంచుకో బోబన్) ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Patriot Review In Telugu): స్మార్ట్ ఫోన్ లేని మనుషులు ఈ రోజుల్లో మనకు కనిపించడం అరుదు. జనాల చేతుల్లో మొబైల్స్, విద్యార్థులు & ఉద్యోగుల చేతుల్లో ల్యాప్‌టాప్స్‌ ఉంటున్నాయి. మనకు తెలియకుండా మన మాటలు వింటూ మనం రోజువారీ జీవితాన్ని రికార్డు చేస్తే? మన డేటాను ట్రాక్ చేస్తే? డేటా చోరీ వల్ల ప్రజలు ఎదుర్కొనే ముప్పు, అనర్థాల నేపథ్యంలో అవినీతి, రాజకీయ అంశాలను మేళవించి మహేష్ నారాయణన్ 'పేట్రియాట్' తీశారు. ఇదొక స్పై ఫిల్మ్. అయితే... స్పై థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా నిదానంగా సాగుతుంది.

'పేట్రియాట్'లో మలయాళ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్స్ నటించారు. మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార, ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్ వంటి తారాగణం ఉన్నప్పుడు అభిమానులు హీరోయిజం, విజిల్ వర్తీ మూమెంట్స్ ఆశిస్తారు. అయితే... దర్శకుడు మహేష్ నారాయణన్ కథకు కట్టుబడి సినిమా తీశారు. కమర్షియల్ అంశాల జోలికి అస్సలు వెళ్ళలేదు. సినిమాలో మోహన్ లాల్ మరొక హీరో అని చెప్పలేం. అతిథి కంటే ఎక్కువ కనిపించే ప్రత్యేక పాత్ర ఆయనది. నయనతార అయితే మరీ అతిథి పాత్ర చేశారు. ఎవరెంత సేపు కనిపించారు? అనేది పక్కన పెడితే... ప్రతి పాత్రకు ఒక కథ చెప్పారు దర్శకుడు. ఫహాద్ ఫాజిల్ ఫైటర్ జెట్ సీన్, కుంచకో - దర్శన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసే సీన్, యూట్యూబర్స్ / ఇన్‌ఫ్లూయన్సర్స్‌ మీట్ గానీ... ఇలా చెబుతూ వెళితే నిడివి పెంచిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. మూడు గంటల నిడివిలోనూ ఎటువంటి కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ థియేటర్‌లో కూర్చోబెట్టగలిగారు దర్శకుడు మహేష్ నారాయణన్.

'పేట్రియాట్'లోని అసలు కథలోకి, దేశభక్తిలోకి వెళ్ళడానికి దర్శకుడు మహేష్ నారాయణన్ చాలా సమయం తీసుకున్నారు. సినిమా ప్రారంభమైన గంట వరకు క్యారెక్టర్ల పరిచయానికి సరిపోయింది. నెమ్మదిగా ఒక్కో చిక్కుముడి వేసుకుంటూ ముందుకు వెళ్లారు. పతాక సన్నివేశాలు వచ్చేసరికి ఒక్కో చిక్కుముడి సమాధానం చెబుతూ వచ్చారు. నళిని (రేవతి) & జ్యోతి (దర్శన) హత్యలకు డేనియల్ రివేంజ్ తీసుకునే సన్నివేశాన్ని బాగా రాశారు. పలు సన్నివేశాలకు, క్యారెక్టర్లకు ఇచ్చిన క్లోజర్ బావుంది. ప్రీ క్లైమాక్స్‌లో తండ్రితో ఫహాద్ ఫాజిల్ సంభాషణ సర్‌ప్రైజ్ చేస్తుంది. అక్కడో ట్విస్ట్ ఇచ్చారు దర్శకుడు. అందువల్ల, ఇంటర్వెల్ ముందు కంటే తర్వాత సగం ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణం... మహేష్ నారాయణన్ విజన్‌ను సపోర్ట్ చేశాయి. నిడివి విషయంలో కొంత కత్తిరిస్తే బావుంటుందేమో!? యాక్షన్ కొరియోగ్రఫీని మెచ్చుకోవాలి. మోహన్ లాల్ లిఫ్ట్ ఫైట్ బాగా కంపోజ్ చేశారు.

ఇమేజ్ కాకుండా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించడం మమ్ముట్టి స్టైల్. ఈ మధ్య కాలంలో ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు, క్యారెక్టర్లు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. 'పేట్రియాట్' స్పై ఫిల్మ్ కాబట్టి యాక్షన్ ఇమేజ్ కోసం ట్రై చేసినా తప్పేం కనిపించదు. కానీ, నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మోహన్ లాల్ నటనతో పాటు యాక్షన్ కూడా అదరగొట్టారు. ఫహాద్ ఫాజిల్ స్టైలిష్ విలనిజం చూపించారు. కుంచకో బోబన్, దర్శనా రాజేంద్రన్ నటన ఆయా క్యారెక్టర్లను ఎలివేట్ కావడంలో దోహదపడ్డాయి. నయనతారది తక్కువ స్క్రీన్ స్పేస్.

స్టార్‌డమ్‌ పక్కన పెట్టి... కథ, క్యారెక్టర్లకు కట్టుబడి మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా 'పేట్రియాట్'. రేసీ స్పై థ్రిల్లర్లకు భిన్నంగా నిదానంగా ముందుకు వెళ్లినప్పటికీ... కథ, క్లోజర్ పరంగా ప్రేక్షకులకు సంతృప్తి ఇస్తుంది. ఈ సినిమా స్లోగా ఉంటుంది. కానీ, మధ్యలో మమ్ముట్టి & మోహన్ లాల్ అభిమానులకు కావాల్సిన కొన్ని హీరోయిజం మూమెంట్స్ కూడా అందించింది. మలయాళ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు నచ్చుతుంది. తెలుగు ప్రేక్షకులకు కాస్త స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది.

Author : Satya Pulagam

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam