Telangana Formation Day Janasena Meet: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 2న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ కు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు.
తెలంగాణాలో కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు గచ్చిబౌలి వేదికగా ఈ భారీ సభకు ప్లాన్ చేశారు. అయితే, చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేయడంతో జనసేన కేడర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభకు పోలీసుల బ్రేక్!
తెలంగాణలో జనసేన పార్టీ ఉనికిని చాటడంతో పాటు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఈ సభకు శ్రీకారం చుట్టారు. అయితే, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తుండటంతో పాటు శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులను సాకుగా చూపుతూ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలి ఏరియాలో భారీగా జనసమీకరణ జరిగితే ఐటీ కారిడార్లో ట్రాఫిక్ స్తంభించిపోయే ప్రమాదం ఉందన్నది పోలీసుల వాదన.
రాజకీయ వ్యూహమా? ప్రభుత్వ ఒత్తిడా?
పోలీసుల నిర్ణయం వెనుక గట్టి రాజకీయ వ్యూహం ఉందనే ఆరోపణలు జనసేన శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు, పలువురు మేధావులు పవన్ కళ్యాణ్ సభను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను దెబ్బతీసేలా గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. ప్రభుత్వం కావాలనే పోలీసు యంత్రాంగం ద్వారా సభను అడ్డుకుందనే విమర్శలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ తదుపరి అడుగు ఏంటి?
సభకు అనుమతి నిరాకరించడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ వెనక్కితగ్గరు. పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జనసేన నేతలు. సభను బహిరంగంగా కాకుండా ఇన్ డోర్ స్టేడియంలో లేదా పార్టీ ముఖ్య నేతలతో అంతర్గత సమావేశంగా మార్చే అవకాశాలనూ జనసేన లీగల్ టీమ్ పరిశీలిస్తోంది.
తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పెంచిన నవనిర్మాణ సంకల్ప సభ
జనసేన సభ జరగకముందే తెలంగాణ రాజకీయాల్లో ఈ స్థాయి లొల్లి జరగడం చూస్తుంటే.. భవిష్యత్తులో ఇక్కడ జనసేన విస్తరణ అంత సులువు కాదనేది స్పష్టమవుతోంది. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి నేత ఇక్కడికి వచ్చి ఉనికి చాటాలని చూడటాన్ని అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఏదేమైనా, ఈ సభ అనుమతి నిరాకరణ ఉదంతం పవన్ కళ్యాణ్కు తెలంగాణలో మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టడమే కాకుండా, రేపటి రోజున ఆయన తీసుకోబోయే పొలిటికల్ డెసిషన్ పై ఉత్కంఠను రేపుతోంది.
Author : Raja Sekhar Allu

