Pawan Kalyan Press Meet: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెడుతున్న పొలిటికల్ ప్రెస్మీట్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోతోంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవ నిర్మాణ సభ పేరుతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని భావించారు. కానీ పోలీసులు, హైకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో కేవలం ప్రెస్మీట్తో సరిపెడుతున్నారు. విశ్లేషణతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ అజెండా, ప్రాంతీయవాదం చుట్టూ అల్లుకుంది. ఇంతకీ ప్రెస్మీట్లో వీటిపై పవన్ స్పందిస్తారా లేదా తన పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి వదిలేస్తారా అనే చర్చ నడుస్తోంది.
చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పోలీసులు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ హైదరాబాద్ వేదికగా నవ నిర్మాణ సభ పేరుతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని చూశారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో తెలంగాణ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. మంగళవారం నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో ఈ సభకు జనసేన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ చివరి నిమిషంలో అనుమతి రాకపోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ తన నివాసంలో ప్రెస్మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
హైకోర్టులో చుక్కెదురు
మరోవైపు పట్టువదలని జనసేన పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగర్సెల్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ జరిపి సభకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన వ్యక్తులు హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.
పవన్పై కాంగ్రెస్ విమర్శలు
మరోవైపు పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ వాటికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని పవన్ గతంలో అన్నారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ రాజకీయం చేస్తామంటే ఎలా అంగీకరిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడానికి పవన్ కల్యాణ్ను తెలంగాణలోకి బీజేపీ పంపిస్తోందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు వైషమ్యాలు సృష్టించడానికే ఈ ప్రయత్నమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. వ్యక్తుల మధ్య ఉండే విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హితవు పలికారు. పవన్ తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని, అనవసర వివాదాల కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
గన్ పార్క్ వద్ద ఘర్షణ
కేవలం మాటల యుద్ధానికే పరిమితం కాకుండా, వివాదం భౌతిక దాడుల వరకు వెళ్లింది. మంగళవారం ఉదయం అమరవీరుల స్మార చిహ్నం వద్ద నివాళులర్పించే క్రమంలో జనసేన, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని జనసేన నేతలు నిరసించగా, కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్తా తీవ్ర వాగ్వాదానికి, తోపులాటకు దారి తీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో కాసేపు గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరోవైపు పవన్ కల్యాణ్ తన పోరాట పటిమను తెలంగాణ నుంచే నేర్చుకున్నానని పవన్ చెబుతున్నారు. జనసేన ఊపిరి పోసుకున్నదే తెలంగాణ గడ్డపై అని, ఈ నేలంటే తనకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. కనీసం తన ఇంట్లో ప్రెస్మీట్ పెట్టుకోవడానికైనా అనుమతి ఇస్తారా అని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ రావడం పార్టీ విస్తరణ ప్రయత్నం మాత్రమే కాదు. ఇది రాబోయే రోజుల్లో తెలంగాణలో మారబోతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతం. కాంగ్రెస్ దీనిని తీవ్రంగా ప్రతిఘటిస్తుండగా, దీని వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలతో విరుచుకుపడుతోంది.
Author : Khagesh

