Dailyhunt
Perni Kittu:  పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?

Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?

ABP దేశం 1 week ago

Perni Nani son Kittu: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు అంశంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ,పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఆక్రమణల తొలగింపులో భాగంగా అధికారులు ఒక నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా, కిట్టు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులతో ఆయనకు వాగ్వాదం జరిగింది. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పై కిట్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. కిట్టు నేరుగా సీఐ వైపు వేలు చూపిస్తూ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. మీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ అంటూ రుబాబు చేస్తూ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తున్నామని పోలీసులు ఎంత సర్దిచెప్పినా, ఆయన మాత్రం ఏమాత్రం తగ్గకుండా తిట్ల దండకం అందుకున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, యూనిఫాంలో ఉన్న అధికారి పట్ల ఇంత అహంకారమా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

కూల్చివేత జరుగుతున్న ప్రదేశంలో ఉద్రిక్తత పెరగడంతో, పోలీసులు కిట్టును , ఆయన అనుచరులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో పరిస్థితి చేయి దాటింది. అధికారం పోయినా ఇంకా పాత ధోరణిలోనే పోలీసులపై దౌర్జన్యం చేస్తున్నారని కూటమి నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఈసారి కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ, విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిని దూషించినందుకు మరియు విధులకు ఆటంకం కలిగించినందుకు కిట్టుపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు, వైరల్ వీడియోల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Author : Raja Sekhar Allu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam